బెంగళూరు: భారత పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి దేశవాళీ క్రికెట్‌లో పర్వేజ్ రసూల్ షాక్ ఇచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ మ్యాచులో భాగంగా గురువారం ప్రారంభమైన మ్యాచులో పర్వేజ్ రసూల్ అద్భుతమైన క్యాచ్ అందుకుని ధోనీని తక్కువ పరుగులకే వెనక్కి పంపించాడు.
ఎనిమిదేళ్ల తర్వాత ధోనీ జార్ఖండ్ తరఫున విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటన్నాడు. ధోనీ 24 బంతులు ఆడి ఒక్క ఫోర్ సాయంతో కేవలం 9 పరుగులు చేశాడు. జమ్మూ కాశ్మీర్ ఎడమ చేతి వాటం స్పిన్నర్ వేసిన బంతి ధోనీ బ్యాట్‌కు తగిలి లేచింది. గాలిలో లేచిన బంతిని పర్వేజ్ రసూల్ స్లిప్‌లో ఎడమ వైపు డైవ్ చేసి అద్భుతంగా పట్టుకున్నాడు. దాంతో ధోనీ పెవిలియన్ చేరుకున్నాడు.

జార్ఖండ్ 20 ఓవర్లలో 73 పరుగులు చేసి ధోనీని మూడో వికెట్‌గా కోల్పోయింది. ధోనీ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ మందకొడిగా బ్యాటింగ్ ప్రారంభించాడు. అయితే, అనూహ్యంగా రసూల్ క్యాచ్‌తో ఔటయ్యాడు. ధోనీ బ్యాటింగ్ కోసం, ఆయన హెలికాప్టర్ షాట్ కోసం ఎదురు చూస్తూ అభిమానులు నినాదాలు చేస్తున్న సమయంలో ఇన్నింగ్సు ముగిసింది.
గురువారం ఉదయం తన జట్టు సభ్యులతో ధోనీ వార్మింగ్ చేస్తూ చాలా కూల్‌గా కనిపించాడు. బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ అతను కనిపించాడు. జార్ఖండ్ జట్టుకు ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరోన్ నాయకత్వం వహిస్తున్నాడు. అరోన్ నాయకత్వంలో ధోనీ ఆడుతున్నాడు.