న్యూఢిల్లీ: ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఊరించి ఊసురుమనిపించింది. టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో చేతులెత్తేసి అభిమానులను మరోసారి నిరాశపరిచింది. అయితే కీలక పోరులో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ విఫలమవ్వడంతో ఆర్సీబీ విజయవకాశాలను దెబ్బతీసింది. అయితే ఆర్సీబీ వైఫల్యంపై స్పందించిన ఆ జట్టు మాజీ ప్లేయర్ పార్దీవ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ అనవసరంగా రిటైన్ చేసుకుందని అభిప్రాయపడ్డాడు. లీగ్‌లో ఎప్పుడూ అతను రాణించింది లేదని, ఐదేళ్లకోసారి రాణించి కోట్లు దండుకోవడమే తప్పా మ్యాక్స్‌వెల్ చేసిందేం లేదని విమర్శించాడు.
'ఆర్సీబీ.. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ని రిటైన్ చేసుకోవడం చూసి నేను షాక్ అయ్యా. అతను ఆడింది ఒకే ఒక్క సీజన్. అందులో కాస్త మెరుగ్గా పరుగులు చేశాడు.
ఐపీఎల్లో అతని పర్ఫామెన్స్ ఎలా ఉందో అందరికీ తెలుసు. ప్రతీ ఐదు సీజన్ల తర్వాత ఓ సారి అతను మంచిగా ఆడతాడు. ఆ పర్ఫామెన్స్తోనే కోట్లు జేబులో వేసుకుంటున్నాడు. అలాంటి ప్లేయర్, ప్రతీ ఏడాది ఆడతాడని ఆశలు పెట్టుకోవడమే ఆర్సీబీ చేసిన ఘోర తప్పిదం. ఐపీఎల్ 2022 సీజన్లో రిటైన్ చేసుకున్న ప్లేయర్లు సరిగ్గా ఆడకపోవడమే ఆ ఫ్రాంఛైజీని దెబ్బతీసింది.' అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2021 సీజన్లో 14 మ్యాచుల్లో 513 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఆర్సీబీ రూ.11 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్లో 13 మ్యాచులు ఆడిన అతను 301 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. అలాగే రూ.7 కోట్లకు రిటైన్ చేసుకున్న మహ్మద్ సిరాజ్, 15 మ్యాచుల్లో కలిపి 9 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వేలానికి వదిలేసిన యజ్వేంద్ర చాహాల్, రాజస్థాన్ రాయల్స్ తరుపున అదరగొడుతూ పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. సిరాజ్ ఘోర వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. విరాట్ కోహ్లీ సైతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.