హైదరాబాద్: తల్లిదండ్రులు తమ పిల్లలను సమానంగా చూడాలని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పిలుపునిచ్చాడు. మనదేశంలో బాలికల పట్ల వివక్ష చూపుతున్నారని, చిన్నతనం నుంచే తల్లి దండ్రులు వారిపట్ల సమానదృష్టిని ప్రదర్శించాలని కోరాడు. యునిసెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలల దినోత్సవంలో సచిన్ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా సచిన మాట్లాడుతూ 'తల్లిదండ్రులందరూ ఆడ-మగ అంటూ తమ పిల్లల మధ్య వ్యత్యాసం చూపించకండి. ఇద్దర్ని సమానంగా చూడండి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎంతో బాధ్యతా యుతంగా మెలగాలి. వీలైనంత ఎక్కువ సమయం వారితో గడిపేందుకు ప్రయత్నించండి. వారిని ప్రేమించండి. ప్రేమగా హత్తుకోండి' అని సచిన్ అన్నాడు.
'పసితనంలో తొలి వెయ్యిరోజులు ఎంతో కీలకం. ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. ఎంతో ఆత్మవిశ్వాసంతోనూ కనిపిస్తున్నారు. నేను చాలా మంది పిల్లల్ని కలిశాను. టెక్నాలజీ వారిని స్మార్ట్‌గా తయారు చేస్తోంది. టెక్నాలజీ విప్లవంతో ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా క్షణాలలో తెలుసుకునే అవకాశం ఈ కాలం పిల్లలకు అందుబాటులో ఉంది' అని సచిన్ తెలిపాడు.
'మూడేళ్ల బాలలు కూడా కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లను ఆపరేట్ చేస్తున్నారు. ఫోన్ కోసమైనా.. మెసేజ్ చేయడానికైనా. ఆధునిక సాంకేతిక పరికరాలు నేటి బాలల ఆలోచనా దృక్పథాన్నే మార్చివేశాయి' అని సచిన్ చెప్పుకొచ్చాడు. మరోవైపు అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సచిన్ తన ట్విటర్ ద్వారా సారా, అర్జున్‌తో కలిసి దిగిన ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
ఇది సారా, అర్జున్ చిన్ననాటి ఫొటో. 'సారా, అర్జున్ చాలా త్వరగా పెరిగి పెద్దవారయ్యారు. కానీ, నాకు మాత్రం వీరు ఎప్పటికీ చిన్న పిల్లలే. నా బ్యూటిఫుల్ కిడ్స్‌కు హ్యాపీ చిల్డ్రన్స్ డే. అలాగే, అందరికీ అంతర్జాతీయ బాలల దినోత్సవం' అని సచిన్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.