
ఎమోషనల్ పోస్ట్..
ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న పంత్.. తాజాగా చేసిన పోస్టు వైరల్ అవుతోంది. 'ప్రశాంతంగా కూర్చొని చల్లగాలి పీల్చుకోవడం ఇంత బాగుంటుందని ఎప్పుడూ అనుకోలేదు' అని తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు పెట్టాడు పంత్. ఇది చూసిన అభిమానులు అతను ఇన్ని రోజులు ఎంత నరకం అనుభవించాడో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అలాగే గురువారం మొదలయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పంత్‌ను మిస్ అవుతామని కామెంట్లు చేశారు.

టెస్టుల్లో తగ్గని గ్రాఫ్..
భారత్ తరఫున టెస్టుల్లో పంత్ అద్భుతంగా రాణించాడు. గతేడాది పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చెత్త ఫామ్‌లో ఉన్నా కూడా టెస్టుల్లో మాత్రం పంత్ అదరగొట్టాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో కూడా రాణించాడు. అయితే సెంచరీ మాత్రం నమోదు చేయలేకపోయాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అయినా అతను మళ్లీ సెంచరీల బాట పడతాడని అభిమానులు భావించారు. కానీ రోడ్డు ప్రమాదం వల్ల ఈ ఏడాది చాలా కాలం పాటు అతను క్రికెట్‌కు దూరం అవ్వాల్సి వచ్చింది. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో కూడా పంత్ ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.

ఘోరమైన యాక్సిడెంట్..
గతేడాది చివర్లో న్యూఇయర్ కోసం ఇంటికి వెళ్తుండగా పంత్‌కు ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. యూపీలోని డెహ్రాడూన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పంత్ నడుపుతున్న మెర్సిడెజ్ కారు దగ్ధమైంది. దారి మధ్యలో అదుపు తప్పిన అతని కారు.. డివైడర్‌ను డీకొట్టడంతో మంటలు అంటుకున్నాయి. అటుగా వెళ్తున్న ఒక బస్సు డ్రైవర్.. తన వాహనాన్ని ఆపి కిందకు దిగాడు. కారులో నుంచి బయటకు కనిపిస్తున్న పంత్‌ను రక్షించాడు.

మళ్లీ ఆడేది ఎప్పుడో?
రూర్కీలోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి అవసరమైన చికిత్స అందించారు. పంత్ పరిస్థితి కొంత కుదుట పడగానే హెలికాప్టర్లో అతన్ని ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ హాస్పిటల్‌కు తరలించారు. ఇక్కడ పంత్ మోకాళ్లు తదితర ప్రాంతాల్లో పలు శస్త్రచికిత్సలు చేశారు. ప్రస్తుతం పంత్ ఇక్కడే ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ ఏడాది చివర్లో కానీ, లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో కానీ అతను మళ్లీ క్రికెట్ ఆడే అవకాశం ఉందని సమాచారం.


Click it and Unblock the Notifications












