హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తోన్న తరుణంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.! జైల్లో మగ్గుతోన్న ఏకంగా 22 మంది జాలర్లను విడుదల చేసింది. ఇప్పుడీ విషయం భారత్ క్రికెట్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగిందంటే?
మీడియా రిపోర్ట్స్ ప్రకారం, పాకిస్థాన్ లోని జైల్ లో దాదాపు 180 మంది జాలర్లు చిక్కుకుని ఉన్నారు. వారిలో ఒక జాలర్ జనవరి 23న మరణించాడు. అయితే ఈ విషయమై భారత ప్రభుత్వం వారిని త్వరగా రిలీజ్ చేసేలా దాయాది ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే పాక్ ప్రభుత్వం కరాచీ జైల్లో మగ్గుతోన్న 22 మంది భారత జాలర్లను విడుదల చేసింది. వారంతా ఇప్పుడు భారత్ లో అడుగుపెట్టారు. భారత్ - పాక్ మధ్య సంబంధాలు మెరుగు పడాలనే ఉద్దేశ్యంతో పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప్రస్తుతం జాలర్లను జైలు నుంచి విడుదల చేసిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ విషయం గురించి పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ కూడా మాట్లాడారు. 22 మంది భారత జాలర్లను విడిచిపెట్టినట్లు పేర్కొన్నారు. భారత్ - పాక్ జట్ల మధ్య ఆసక్తికర మ్యాచ్ సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ , పాకిస్థాన్ ఇప్పటివరకు 5 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా రెండు సార్లు విజయం సాధిస్తే.. పాకిస్థాన్ మూడు సార్లు గెలుపొందింది.