ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ - పాక్ మ్యాచ్ కు అంతా సిద్ధమైన వేళ పాకిస్థాన్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలేటట్టు కనిపిస్తోంది. అసలే న్యూజిలాండ్ పై ఓటమితో ఒత్తిడితో ఉన్న పాక్ జట్టులో ఓ స్టార్ బ్యాటర్ టీమిండియాతో మ్యాచ్ కు అనుమానమే అని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఛాంపియన్స్ ట్రోఫీలో మందుకు వెళ్లడం పాక్ జట్టుకు కాస్త కష్టమనే చెప్పాలి. ఇంతకీ ఆ కీలక ప్లేయర్ ఎవరంటే?
దూరం కానున్న కీలక స్టార్ అతడే!
టీమిండియాతో డూ ఆర్ డై మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంది. అయితే ఈ సెషన్ కు స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ గైర్హాజరయ్యాడని తెలిసింది. దీంతో అతడు భారత్ తో జరిగే మ్యాచ్ ఆడటంపై అనుమానాలు ఏర్పడ్డాయి. పైగా ఈ ప్రాక్టీస్ సెషన్ ను ఉద్దేశించి పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ ప్రత్యేకంగా ఆటగాళ్లతో కాసేపు మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా భారత జట్టుపై గెలవాలని సూచించారు.
జిడ్డూ బ్యాటింగ్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది. పైగా గత కొంత కాలంగా ఫామ్ లోని లేని బాబర్.. ఈ మ్యాచ్ లో కూడా నిరాశపరిచాడు. 90 బంతులు ఎదుర్కొన్న అతడు 64 పరుగులు జిడ్డూ బ్యాటింగ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ , పాకిస్థాన్ ఇప్పటివరకు 5 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా రెండు సార్లు విజయం సాధిస్తే.. పాకిస్థాన్ మూడు సార్లు గెలుపొందింది.
