

హైదరాబాద్: మా బ్యాట్స్‌మెన్ తీవ్రమైన ఒత్తిడికి లోనవడం వల్లే ఆసియా కప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిందని పాక్ కోచ్ మైకీ ఆర్థర్ అన్నాడు. భారత్ అన్ని విభాగాల్లో తమకన్నా మెరుగ్గా ఆడిందని పేర్కొన్నాడు. బుధవారం దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు భువీ, బుమ్రా, జాదవ్ విజృంభణతో పాక్ 162 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం పాక్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత్ 29 ఓవర్లలో అలవోకగా సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్థాన్ కోచ్ మైకీ ఆర్థర్ మాట్లాడుతూ "పాక్ బ్యాట్స్‌మెన్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. మూడో ఓవర్ వేసిన భువి బౌలింగ్‌లో ఇమామ్ అలా ఔటవ్వాల్సింది కాదు. సర్ఫరాజ్ అహ్మద్ హిట్టింగ్ చేయాల్సిన వాడు కాదు" అని అన్నాడు.
"ఆ పాత్రలను పోషించేందుకు మా వద్ద ఇతరులు ఉన్నారు. మాముల్ హక్, సర్ఫ్‌రాజ్ అహ్మద్ మరీ అధ్వానంగా ఔటయ్యారు. జమాన్, అసిఫ్ ఆడిన షాట్లు వారి సహజసిద్ధంగా ఆడేవే. కానీ మిగతా నలుగురు బ్యాట్స్‌మెన్ ఆడిన తీరు సరికాదు. వారు బాధ్యతగా ఉండాల్సింది. ఇమామ్ ఒత్తిడికి లొంగిపోయాడు" అని కోచ్ మైకీ ఆర్థర్ అన్నాడు.
"ఇలాంటి పిచ్‌పై ఆరంభం నుంచే ధాటిగా ఆడాలి. కానీ పాక్ ఆ పని చేయలేకపోయింది. ఇక బౌలర్లు కూడా ప్రణాళిక ప్రకారం బంతులు వేయలేకపోయారు. ఆరంభంలోనే వికెట్ తీయలేకపోయారు. భారత్ మాకన్నా మెరుగ్గా ఆడింది. చాలాసేపు వారు మాపై ఒత్తిడి పెంచారు. మా కన్నా క్రమశిక్షణతో ఆడారు. బుమ్రా చూపిన తేడా స్పష్టంగా కనిపించింది. భారత స్పిన్నర్లూ అద్భుతంగా బౌలింగ్ చేశారు" అని ఆర్థర్ పేర్కొన్నాడు.