హైదరాబాద్: లాహర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా పాకిస్థాన్, వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ జరగనున్న సంగతి తెలిసిందే. మూడు టీ20ల కోసం దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ నేతృత్వంలోని వరల్డ్ ఎలెవన్ జట్టు ఇప్పటికే లాహోర్‌కు చేరుకుంది.
2009లో జరిగిన ఉగ్రదాడి కారణంగా ఆ దేశంలో ఏ జట్టు కూడా క్రికెట్ ఆడేందుకు ముందుకు రాకపోవడంతో, ఈ మూడు టీ20ల సిరిస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
ఈ సిరిస్ కోసం పీసీబీ 30 లక్షల డాలర్లు ఖర్చు చేస్తోందంటే ఈ సిరిస్‌ను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు ఈ మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోన్న లాహోర్ లోని గడాఫీ స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 9 వేల మంది పోలీసులు, పారా మిలిటరీ సిబ్బంది రెండు టీమ్స్ భద్రత ఏర్పాట్లను చూస్తున్నారు.

ఈ మూడు టీ20ల సిరిస్‌తో పాకిస్థాన్‌లో మళ్లీ క్రికెట్ సందడి మొదలైంది. సుదీర్ఘ విరామం తర్వాత తమ దేశంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో పాకిస్థానీ అభిమానులు సంతోషంగా ఫీలవుతున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని లాంటి ఆటగాళ్లు లేరన్న బాధ కూడా మరో వైపు ఉంది.
ఈ మూడు టీ20ల సిరీస్‌ను పండగ చేసుకుంటున్న పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు కోహ్లీ, ధోనీలను మిస్ అవుతామని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. వరల్డ్ ఎలెవన్ తరఫున భారత క్రికెటర్లు ఎందుకు ఆడటం లేదు..? నిన్ను మిస్సవుతున్నాం కోహ్లీ.. అంటూ కొందరు పాక్ క్రికెట్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్‌తో ఆడుతున్న వరల్డ్ ఎలెవన్ జట్టులో ఏడు దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. అయితే భారత్ తరుపు నుంచి ఒక్క ఆటగాడు కూడా లేడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మంగళవారం నుంచి ఈ మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది.