క్రికెట్ అంటే అతడికి పిచ్చి. మరీ ముఖ్యంగా టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర ధోని ఆట అంటే ఇంకా ఇష్టం. ఒక్కమాటలో చెప్పాలంటో ధోని ఆటు చూసేందుకు తన గుండె ఇంకా కొట్టుకుంటుందని ఓ పాకిస్థానీ ప్రకటించాడు. ఆసియాకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ని వీక్షించేందుకు ఏకంగా అమెరికా నుంచి బంగ్లాదేశ్‌కు వచ్చాడు.
అది కూడా అరవై పదుల వయసులో, సుదీర్ఘ ప్రయాణాలకు అతడి ఆరోగ్యం సహకరించకున్నా, మ్యాచ్‌ని వీక్షించకుండా ఉండలేకపోయాడు. ఇంతకీ ఆ అభిమాని పేరు ఏంటంటే మొహమ్మద్ బషీర్. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో ఏమూలన భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగినా ఇతడు ప్రత్యక్షంగా హాజరయ్యేవాడు.
ప్రస్తుతం అమెరికా నగరం షికాగోలో స్థిరపడ్డ మొహమ్మద్ బషీర్ భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వీరాభిమాని. ఇక పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ ఆటను ఆయన చూడకుండా ఉండలేరు. ఆసియా కప్‌లో భాగంగా మొన్న భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు బషీర్ హాజరయ్యారు.

స్టాండ్స్‌లో కూర్చుని ఇరు జట్ల ఆటగాళ్లకు మద్దతు పలికారు. ఇక మ్యాచ్‌కు ముందు రోజు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్టాండ్స్‌లోని బషీర్‌ను చూసి గుర్తు పట్టిన ధోని చేయి ఊపి మరీ బషీర్‌లో ఉత్సాహం నింపాడట. మ్యాచ్ చూసిన తర్వాత బషీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'వారం క్రితం స్వల్పంగా మరోసారి గుండె నొప్పి వచ్చింది. డాక్టర్లు ప్రయాణం చేయవద్దని వారించారు. కానీ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ధోనీ ఆటను చూడకుండా ఆగలేకపోయాను. వెంటనే విమానం ఎక్కి ఇక్కడకి వచ్చాను' అని ఆయన చెప్పారు. భారత్-పాక్ మ్యాచ్‌ని వీక్షించేందుకు బషీర్‌కు ధోనినే టికెట్ పంపించడం విశేషం.
కోహ్లికి జరిమానా:
భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి ప్రకటించిన విరాట్‌కోహ్లీకి జరిమానా విధించారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌కోహ్లీ (49) పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా మహమ్మద్ సమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అంపైర్ ప్రకటించాడు.
ఈ నిర్ణయంపై విరాట్‌కోహ్లీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పెవిలియన్ చేరాడు. నేను అవుటా అంటూ అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించేలా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించడం ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్-1 ని ఉల్లంఘించిన కారణంగా విరాట్ మ్యాచ్ ఫీజులో 30శాతం జరిమానా విధించారు.