
ఇటీవల అన్ని ఫార్మాట్ల నుంచి టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. కోహ్లీ నిర్ణయంపై పలువురు పలు విధాలుగా స్పందించారు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి దూరమవడం పట్ల తాజాగా పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోలేదని, తప్పుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్‌లో ఆడుతున్న అక్తర్ తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కోహ్లీ కెప్టెన్సీ వివాదం గురించి మాట్లాడాడు.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోలేదని, బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఇది సరైన సమయం కాదని చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం అతడిని అతడు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు. అతనేమైనా ఇనుముతో తయారు చేశాడా అని ప్రశ్నించాడు. అలాగే విరాట్ కోహ్లీ గొప్ప వ్యక్తి అని, గొప్ప క్రికెటర్ అని కొనియాడాడు. కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెన్ అన్న అక్తర్.. ప్రపంచంలో అందరి కంటే ఎక్కువ పరుగులు సాధించాడని ప్రశంసించాడు. అయితే కోహ్లీ తన బలహీనతల నుంచి బయటపడి అతని సహజ స్థాయిలో ఆడాలని షోయబ్ అక్తర్ సూచించాడు.
కాగా టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 4 నెలల వ్యవధిలో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ ప్రారంభం సమయంలో తాను పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. అలాగే ఐపీఎల్‌లోనూ ఇక కెప్టెన్‌గా ఉండనని తెలిపాడు. అయితే వన్డే, టెస్టు కెప్టెన్‌గా కొనసాగాలని కోహ్లీ భావించాడు. కానీ అది నెరవేరలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీనిపై అప్పట్లో పెను దుమారమే రేగింది. బీసీసీఐ, కోహ్లీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో టీమిండియా టెస్టు సిరీస్ ఓడిపోవడంతో ఆ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు.
టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ విజయవంతమయ్యాడనే చెప్పుకోవాలి. టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాకుండా అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ముఖ్యంగా కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు విదేశాల్లో విజయాలు సాధించడం విశేషం. కోహ్లీ నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచింంది.