తాను అందంగా, ఆకర్షణీయనంగా కనిపించడమే ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టిందని అన్నాడు ఓ క్రికెటర్. ఈ కారణంగానే తనను జట్టులో సీనియర్ ప్లేయర్స్ టార్గెట్ చేశారని ఆరోపించాడు. అందుకే తనకు అవకాశాలు లేకుండా పోయాయని పరోక్షంగా ఆరోపించాడు. ఇంతకీ అతడు ఎవరంటే?
పాకిస్థాన్ క్రికెటర్ అహ్మద్ షెహ్జాద్ ఈ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన వే ఆఫ్ లుకింగ్, టాకింగ్ చూసి కొంతమంది సీనియర్ క్రికెటర్లు ఈర్ష్య చెందారని అన్నాడు. జట్టులో ఎవరైతే అట్రాక్టివ్ గా, సూపర్ ఫ్యాషన్ సెన్స్ తో ఉంటారో.. వాళ్లను సీనియర్లు టార్గెట్ చేస్తారని, తాను అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు.

"అందంగా, స్టైలిష్ గా, మంచిగా కనిపించడమే నాకెన్నో సమస్యలను తెచ్చిపెట్టింది. ఒకవేళ మీరు మంచిగా కనిపిస్తే, డ్రెస్సింగ్ స్టైల్ అద్భుతంగా ఉండి బాగా మాట్లాడితే, కొంతమంది మీకు వ్యతిరేకులుగా మారుతారు. మేం వెనకబడిన ప్రాంతాల నుంచి వచ్చాం. నేను అనార్కలి, లాహోర్ వంటి ప్రాంతాల్లో జీవించాను. నాకు కాస్త గుర్తింపు రాగానే, నా పర్సనాలిటీని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాను. కానీ ఇది కూడా జట్టులో నా సమస్యలను తెచ్చిపెట్టింది." అని బాధను వ్యక్తం చేశాడు. తాను వేగంగా ఎదిగే తీరు, చిన్నవయసులోనే తనకు వచ్చిన పాపులారిటీని చూసి తనపై ద్వేషాన్ని, ఈర్ష్యాను పెంచుకున్నట్లు తెలిపాడు షెహ్జాద్.
షెహ్జాద్ తన చివరి మ్యాచ్ ను 2020లో పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడాడు. 2019లో పీఎస్ఎల్ టైటిల్ గెలిచిన టీమ్ లో సభ్యుడు. కానీ 2020లో అతడు ఆశించిన తీరులో ప్రదర్శన చేయలేకపోయాడు. ఏడు ఇన్నింగ్స్ లో 61 పరుగులు చేశాడు. గత ఐదేళ్లలో జాతీయ జట్టులోనూ చోటు సంపాదించుకోలేకపోయాడు. మొత్తంగా కెరీర్ లో 13 టెస్ట్ మ్యాచులు, 81 వన్డేలు, 59 టీ20 మ్యాచులు ఆడాడు. కానీ ఏ ఒక్క ఫార్మాట్ లోనూ కీలక ఆటగాడిగా ఎదగలేకపోయాడు.