
కరాచి: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇంటి దారి పట్టడం, టీమిండియా దర్జాగా సెమీ ఫైనల్‌లో అడుగు పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పొరుగు దేశానికి క్రికెట్ అభిమానులు. టీమిండియాపై అక్కసు వెల్లగక్కుతున్నారు. సాధారణ అభిమానులంటే ఫర్వాలేదు గానీ.. ఓ మోస్తరు పేరున్న క్రికెట్ విశ్లేషకులు సైతం టీమిండియాపై విషాన్ని చిమ్ముతున్నారు. దీనికి రాజకీయాలను కూడా అంటగడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూరకంగా మహమ్మద్ షమీని అణగదొక్కేస్తోందని ఆరోపిస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా బీసీసీఐకి ఫోన్ చేసి.. ముస్లిం క్రికెటర్ మహమ్మద్ షమీని పక్కన పెట్టాలని సూచించినట్లు తమకు తెలిసిందని విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
శ్రీలంకతో షమీని ఆడించకపోవడం వెనుక..
శ్రీలంక జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మహమ్మద్ షమీని పక్కన పెట్టి, భువనేశ్వర్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకుంది టీమ్ మేనేజ్‌మెంట్. నిజానికి- భువనేశ్వర్ కుమార్ లేని లోటును కనిపించనివ్వలేదు షమీ. ఆడిన నాలుగు మ్యాచుల్లో ఓ హ్యాట్రిక్ సహా 14 వికెట్లను పడగొట్టాడు. అయినప్పటికీ- శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా షమీని తుది జట్టులో చేర్చుకోలేదు. అతని స్థానంలో భువనేశ్వర్ కుమార్‌ను తీసుకున్నారు. దీని వెనుక బీజేపీ ప్రభుత్వం హస్తం ఉందని పాకిస్తాన్‌కు చెందిన ఓ క్రికెట్ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. స్థానికంగా ఓ న్యూస్ ఛానళ్ నిర్వహించిన డిబేట్‌లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.
భారత క్రికెట్ జట్టు టీమ్ మేనేజ్‌మెంట్ ఒత్తిడిలో కనిపిస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఒత్తిడిని తీసుకొస్తోందని, తుది జట్టులో ఎవర్ని తొలగించాలి? ఎవర్ని తీసుకోవాలనే విషయాన్ని ఆ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్దేశిస్తున్నారని చెప్పారు. శ్రీలంకతో మ్యాచ్‌లో మహమ్మద్ షమీని ఆడించి ఉంటే- కొన్ని రికార్డులు ఆయన వశం అయి ఉండేవని అన్నారు. ఓ ముస్లిం బౌలర్ పేరిట రికార్డులు నమోదు కాకూడదనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం షమీని పక్కన పెట్టాలని బీసీసీఐపై ఒత్తిడి తెచ్చి ఉంటుందని అన్నారు. ఇంతకుముందు- పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ సైతం ఇలాంటి వ్యాఖ్యానాలే చేసిన విషయం తెలిసిందే. ముసల్మాన్ షమీ వల్లే టీమిండియా ఘన విజయాలను అందుకుంటోందని రజాక్ చేసిన ప్రకటన అప్పట్లో ప్రకంపనలు రేపాయి.