కరాచీ: ప్రపంచ కప్‌లో భాగంగా మార్చి 20తేదీన ఆస్ట్రేలియాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఉన్నందున తాము ఇప్పుడే.. మరోసారి ఈ టోర్నమెంటులో భారత జట్టుతో సెమీఫైనల్లో తలపడే విషయమై ఆలోచించడం లేదని పాకిస్తాన్ సారథి మిస్బా ఉల్ హక్ అన్నాడు.
అతను పీటీఐకి అడిలైడ్ నుండి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఒకవేళ సెమీ ఫైనల్లో భారత్‌ను ఢీకొట్టే అవకాశం వస్తే.. తమకు అది మరో అవకాశమన్నాడు. ప్రపంచ కప్‌ల్లో భారత్ పైన ఇప్పటి వరకు పాకిస్తాన్ గెలవలేదు. ఈ నేపథ్యంలో అది తమకు అవకాశంగా భావిస్తామని చెప్పాడు.
ఆ అవకాశం వస్తే తాము పాజిటివ్ మైండ్‌తో ఆడతామన్నాడు. గెలిచేందుకు ప్రయత్నం చేస్తామన్నాడు. ముహమ్మద్ ఇర్ఫాన్ లేకపోవడం తమకు కొంత ఇబ్బందే అన్నాడు. తాము ఆస్ట్రేలియాను ఓడిస్తామనే విశ్వాసం ఉందని చెప్పాడు.

భారత జట్టు ఆట తీరుపై మాట్లాడుతూ.. భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ అని, ఇది వారికి మంచి ప్రేరణ అన్నాడు. అలాగే, గత మూణ్ణాలుగు నెలలుగా వారు ఆస్ట్రేలియాలో ఆడుతున్నారని, ఇది కలిసి వచ్చే అంశమన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయినప్పటికీ ఆత్మవిశ్వాసం ముఖ్యమన్నాడు.
గత రెండేళ్లుగా దాదాపు అదే స్క్వాడ్‌తో ఆడుతున్న భారత జట్టులో ఆత్వవిశ్వాసం కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ మంచి అనుభవజ్ఞుడన్నాడు. ఈ ప్రపంచ కప్‌లో వారు అంచనాలకు తగినట్లుగా ఆడుతున్నారన్నాడు.
తమ జట్టు గురించి మాట్లాడుతూ.. లీగ్ దశలో నాలుగు విజయాల అనంతరం తమ జట్టులో ఉత్సాహం కనిపిస్తోందన్నాడు. మా దేశం గురించి మా జట్టు ఆడుతోందని చెప్పాడు. తనకు ఇది చివరి వన్డే టోర్నమెంట్ అని చెప్పాడు. ఈ టోర్నమెంట్ తనకు ఎప్పటికీ ముఖ్యమవుతుందన్నాడు. ఎందుకంటే, తమ పైన ప్రజలు ప్రపంచ కప్ గెలుస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పాడు. మా ప్రజల కోసం మేం కప్పు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.