హైదరాబాద్: పాకిస్థాన్‌కు క్రికెట్ మళ్లీ తిరిగొచ్చింది. సొంతగడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌ను వీక్షించాలని తపిస్తోన్న పాకిస్థాన్ అభిమానులకు నిజంగా ఇది గొప్ప ఊరట. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాదుల దాడి తర్వాత ఆ దేశంలో టెస్టు హోదా కలిగిన టాప్ జట్టు ఏదీ ఇప్పటివరకు పర్యటించలేదు.
అయితే తాజాగా ఐసీసీ వరల్డ్ ఎలెవన్ జట్టు మూడు టీ20ల టోర్నీ ఆడేందుకు అంగీకరించడంతో అక్కడి అభిమానులు, మాజీ క్రికెటర్లు సంతోషపడుతున్నారు. పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ తన ఆనందాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ఇది మా దేశంలో మళ్లీ క్రికెట్ పుట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ట్వీట్ చేశాడు.
ఈ మూడు టీ20ల సిరీస్‌తో పాకిస్థాన్‌కు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ను తీసుకురావాలని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఈ మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోన్న లాహోర్ లోని గడాఫీ స్టేడియం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 9 వేల మంది పోలీసులు, పారా మిలిటరీ సిబ్బంది రెండు టీమ్స్ భద్రత ఏర్పాట్లను చూస్తున్నారు.
మరోవైపు పాక్ క్రికెట్ అభిమానులు సైతం ఈ టోర్నీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో ఉన్న ఆటగాళ్లలో సగం మందికిపైగా సొంత ప్రేక్షకుల ముందు క్రికెట్ ఆడే అదృష్టం దక్కలేదు. ఇక వరల్డ్ ఎలెవన్ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ వ్యవహరిస్తున్నాడు.
పాకిస్థాన్‌తో వరల్డ్ ఎలెవన్ మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. ఈ టోర్నీ కోసం 30 లక్షల డాలర్లు ఖర్చు చేస్తున్నది పాకిస్థాన్. మిగతా రెండు మ్యాచ్‌లు బుధ, శుక్ర వారాల్లో జరుగుతాయి. తాజా టోర్నీతో పాక్‌లో మరోసారి క్రికెట్ సందడి మొదలైంది.
వరల్డ్ ఎలెవన్ జట్టు: డుప్లెసిస్ (కెప్టెన్), ఆమ్లా, కోలిన్ మిల్లర్, ఇమ్రాన్ తాహిర్, మోర్నీ మోర్కెల్ (దక్షిణాఫ్రికా) జార్జ్ బెయిలీ, పైన్, కటింగ్ (ఆస్ట్రేలియా), తమిమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్), తిసార పెరీరా (శ్రీలంక), గ్రాండ్ ఇలియట్ (న్యూజిలాండ్), కాలింగ్‌వుడ్ (ఇంగ్లాండ్), డారెన్ సామి, శామ్యూల్ బద్రీ (వెస్టిండీస్).