
ఆరంభంలోనే షాక్:
309 పరుగుల భారీ ఛేదనలో దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఆమ్లా (2) రెండో ఓవర్లోనే ఔటైనా.. మరో ఓపెనర్ డికాక్ (47; 60 బంతుల్లో 3×4, 2×6), డుప్లెసిస్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా కోలుకుంది. ఈ సమయంలో షాదాబ్ ఖాన్ దక్షిణాఫ్రికాను దెబ్బతీశాడు. డికాక్‌ను ఔట్ చేసిన కాసేపటికే మార్‌క్రమ్ (7)ను బౌల్డ్ చేశాడు.

డుప్లెసిస్ హాఫ్ సెంచరీ:
ఇక క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ డుప్లెసిస్ (63; 79 బంతుల్లో 5×4)ను 30వ ఓవర్లో ఆమిర్ ఔట్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా కష్టాల్లోపడింది. పాక్ పేలవ ఫీల్డింగ్‌ను సొమ్ము చేసుకుంటూ వాన్‌డర్ డుస్సెన్ (36; 47 బంతుల్లో 1×4, 1×6), మిల్లర్ (31; 37 బంతుల్లో 3×4) ఐదో వికెట్‌కు 53 రన్స్ జోడించారు. మరోవైపు సాధించాల్సిన రన్‌రేట్ బాగా పెరుగుతూ పోయింది. ఏ దశలోనూ దక్షిణాఫ్రికా గెలిచేలా కనపడలేదు.

ఫెలుక్వాయో మెరుపు మెరిపించినా:
40వ ఓవర్లో ప్రొటీస్ స్కోరు 189 వద్ద డుస్సెన్‌ను షాదాబ్, తర్వాతి ఓవర్లో మిల్లర్‌ను షహీన్ అఫ్రిది ఔట్ చేయడంతో ఆ జట్టులో ఉన్న ఆశలు కాస్తా ఆవిరయ్యాయి. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఓటమి లాంఛనమే అనిపించింది. చివరలో ఫెలుక్వాయో (46 నాటౌట్; 32 బంతుల్లో 6×4) బ్యాట్ ఝుళిపించినా కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించాడు. దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 259 పరుగులు చేసి ఓడింది. రియాజ్, షాదాబ్ తలో మూడు వికెట్లు తీశారు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' హరిస్ సొహైల్‌కు దక్కింది.

ఓపెనర్ల శుభారంభం:
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. పాక్‌కు ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్ (58 బంతుల్లో 44; 6 ఫోర్లు), ఫఖర్ జమాన్ (50 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) శుభారంభం అందించారు. కుదురుగా ఆడుతున్న ఓపెనర్లను ఇమ్రాన్ తాహిర్ ఔట్ చేశాడు. తర్వాత బాబర్ ఆజమ్ (80 బంతుల్లో 69; 7 ఫోర్లు), హఫీజ్ (20)లు కూడా బాధ్యతగా ఆడటంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది.

సొహైల్ మెరుపులు:
ఈ సమయంలో హఫీజ్ వెనుదిరిగాక వచ్చిన హరిస్ సొహైల్ (59 బంతుల్లో 89; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన ఆజమ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో బాబర్ 61 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జట్టు స్కోరు 224 పరుగుల వద్ద బాబర్ నిష్క్రమించాడు. అయితే సొహైల్.. ఇమాద్ వసీమ్ (23; 3 ఫోర్లు) కలిసి ఐదో ధాటిగా ఆడుతూ 38 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. అనంతరం మరింత రెచ్చిపోయి భారీ స్కోర్ అందించాడు.


Click it and Unblock the Notifications












