
ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఏం జరిగిందంటే.. మూడో రోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుందనే సమయంలో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆరంభించింది. ఈ క్రమంలో పాకిస్థాన్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ వేసిన మూడో రోజు ఆటలోని చివరి బంతిని ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ డిఫెన్స్ ఆడాడు. అయితే పరుగు కోసం వెళ్లేవాడిలా కనిపించిన మళ్లీ ఆగిపోయాడు. కానీ బౌలింగ్ చేసిన ఆఫ్రిదీ ఒక్క సారిగా వార్నర్ పైకి దూసుకుపోయాడు. వార్నర్ కూడా ఆఫ్రిదీపైకి దూసుకెళ్లాడు. ఇద్దరు ఎదురెదురుగా ఒకరి కళ్లలోకి, ఒకరు సీరియస్‌గా చూసుకున్నారు. దీంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు.
కానీ ఇంతలోనే వార్నర్, ఆఫ్రిదీ నవ్వుకుంటూ ఎవరి దారిని వాళ్లు వెళ్లిపోయారు. ఇది చూసిన తోటి ఆటగాళ్లతోపాటు మైదానంలోని ప్రేక్షకుల మోహాల్లో నవ్వులు పూశాయి. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో షేర్ చేయగా అభిమానులు ఫన్నీ వ్యాఖ్యలు చేస్తున్నారు. కాస్త పొట్టిగా ఉన్న వార్నర్, పొడుగుగా ఉన్న షాహీన్ ఆఫ్రిదీ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకోవడంపై అచ్చం అలాంటివే ఇతర ఫోటోలతో ఆ సన్నివేశాన్ని పోలుస్తూ అభిమానులు వైరల్ చేస్తున్నారు.
ఇక టెస్టు మ్యాచ్ విషయానికొస్తే మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్‌పై ప్రస్తుతం ఆస్ట్రేలియా 134 పరుగుల అధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 391 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 268 పరుగులు చేసింది. పాకిస్థాన్ 20 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోవడం గమనార్హం. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 123 పరుగుల అధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఖవాజా 91, గ్రీన్ 79, ఆలెక్స్ క్యారీ 67, స్టీవ్ స్మిత్ 59 పరుగులు చేశారు. ఇక పాకిస్థాన్ బ్యాటర్లలో షఫీక్ 81, అజార్ అలీ 78, బాబర్ అజామ్ 67 పరుగులు చేశారు.