
రావల్పిండి: పరుగుల వరద పారిన పాకిస్థాన్, ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 5 రోజుల పూర్తి ఆట సాధ్యమైనప్పుటికీ ఇరు జట్ల బ్యాటర్లు పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శించడంతో టెస్ట్ మ్యాచ్‌లో ఏ దశలోనూ ఫలితం వచ్చేలా కనిపించలేదు. పాకిస్థాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలతో చెలరేగాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకపోగా.. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనే లేదు. బౌలర్లకు పట్టు చిక్కని ఈ ఫస్ట్ మ్యాచ్‌లో బ్యాటర్లు మాత్రం పండగ చేసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 476 పరుగుల భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది. పాక్ బ్యాటర్లు అజార్ అలీ (185), ఇమామ్-ఉల్-హక్ (157) భారీ సెంచరీలతో చెలరేగారు. షఫీక్ 44, బాబర్ అజామ్ 36, రిజ్వాన్ 29 పరుగులు చేశారు.
అటు ఆస్ట్రేలియా సైతం తొలి ఇన్నింగ్స్‌లో 459 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఉస్మాన్ ఖవాజా (97), మార్న్ లబుషేన్ (90) తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. స్టీవెన్ స్మిత్ (78), డేవిడ్ వార్నర్ (68) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగతా వారిలో గ్రీన్ 48, అలెక్స్ క్యారీ 19, స్టాక్ 13, కమిన్స్ 8, హెడ్ 8, లియోన్ 3 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో నౌమాన్ అలీ 6 వికెట్లతో సత్తా చాటాడు. షాహీమ్ ఆఫ్రీదీ 2, నసీమ్ షా, సజీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
అనంతరం చివరి రోజు 17 పరుగుల అధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 252 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (136), ఇమామ్-ఉల్-హక్ (111) అజేయ సెంచరీలతో చెలరేగారు. ఇమామ్ ఉల్ హక్‌కు అయితే తొలి, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసి సత్తా చాటాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించిన ఇమామ్ ఉల్ హక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.