
కరాచీ: ప్రమాదకర కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన క్రికెట్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు ఇప్పటికే అనేక దేశాల క్రికెట్ బోర్డులు ప్రయత్నిస్తున్నాయి. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ట్రైనింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తోంది. మరోవైపు భారత ఆటగాళ్లను ఐసోలేషన్ క్యాంపులో ఉంచేందుకు బీసీసీఐ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌లను పునరుద్ధరించేందుకుగాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇంగ్లండ్‌తో టెస్టు, టీ20 సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా సుముఖత వ్యక్తం చేసింది. జులైలో టూర్ నిర్వహించాలని ఇరు బోర్డులు భావిస్తున్నాయి. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో సిరీస్ నిర్వహిస్తున్నా.. ఆటగాళ్లపై ఎలాంటి బలవంతం ఉండదని పీసీబీ సీఈఓ వసీమ్ ఖాన్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ టూర్‌కు సంబంధించి ఈసీబీతో చర్చించామని, టూర్‌కు సంబంధించి కార్యాచరణ సిద్ధమైందన్నాడు. ఈ టూర్ గురించి ఆటగాళ్లపై ఒత్తిడేమీ లేదని, అభ్యంతరమున్నవాళ్లు తప్పుకోవచ్చని తెలిపాడు.
తాజాగా వసీం ఖాన్ ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ... 'ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ను నిర్వహించాలని భావిస్తున్నాం. ఈ విషయమైన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో సుదీర్ఘంగా చర్చించాం. ఇంగ్లండ్‌కు ఆటగాళ్లు పంపే విషయంపై అంగీకారానికి వచ్చినట్టే. అన్ని అనుకున్నట్లు జరిగితే జులైలో పాక్ జట్టు ఇంగ్లండ్ వెళ్తుంది. టూర్ గురించి టెస్టు, వైట్‌బాల్ జట్ల కెప్టెన్లు అజహర్ అలీ, బాబర్ ఆజమ్‌లకు వివరిస్తాం. ఆటగాళ్లందరికీ కూడా ఈ టూర్ గురించి వివరాలు చెబుతాం' అని అన్నాడు.
'టూర్‌కు సంబంధించి ప్రభుత్వ అనుమతిని తీసుకుంటాం. జూలై తొలి వారంలో నాలుగు చార్టెడ్ ఫ్లైట్లలో ఆటగాళ్లను ఇంగ్లండ్‌కు తీసుకెళతాం. ఎప్పటికప్పుడు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. జట్టుతో పాటు ఒక మెడికల్ టీమ్ ఉండనుంది. మాంచెస్టర్, సౌంతాప్టన్ టెస్ట్‌లు ఆడేందుకు వేదికలుగా అనుకుంటున్నాం. మూడో వేదికను ఈసీబీ వెల్లడిస్తుంది. బయో సెక్యూర్ ఏర్పాట్లను సిరీస్ నిర్వహించే దేశమే చూసుకుంటుంది. సవాళ్లు ఎదురవుతున్న పరిస్థితుల్లోనే క్రికెట్‌ను తిరిగి ప్రారంభించడం ఎంతో ముఖ్యం' అని వసీం ఖాన్ పేర్కొన్నాడు.