T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగబోయే హైవోల్టేజ్ పోరుకు రాజకీయ రంగు పులుముకుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేసిన వివాదాస్పద కామెంట్స్ ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా వేదికలపై చర్చనీయాంశంగా మారాయి. భారత్‌తో తలపడే విషయంలో పాకిస్థాన్ మొదట తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఒకవేళ ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా పాక్ ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తే ఆ దేశ క్రికెట్ బోర్డుపై నిషేధం విధిస్తారనే వార్తలు గుప్పుమన్నాయి.
దీనిపై స్పందించిన పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ క్రీడాపరమైన వివరణ ఇవ్వాల్సింది పోయి.. ఏకంగా తమ దేశ సైనిక శక్తిని ప్రస్తావించడం సంచలనం సృష్టించింది. తమ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఎవరికీ భయపడరని.. ఆయన అండ ఉన్నంత కాలం ఐసీసీ ఆంక్షలకు తాము లొంగబోమని ఆయన వ్యాఖ్యానించారు. ఒక బాధ్యతాయుతమైన క్రీడా సంస్థ అధ్యక్షుడి హోదాలో ఉండి.. సైనిక దళాధిపతి పేరుతో ఐసీసీని బెదిరించే ధోరణిలో మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒత్తిడికి తలొగ్గిన పాక్
మొహ్సిన్ నఖ్వీ అంతలా ప్రగల్భాలు పలికినప్పటికీ.. పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చివరకు మెట్టు దిగింది. దీని వెనుక ప్రధానంగా ఐసీసీ నుంచి వచ్చిన గట్టి హెచ్చరికలు ఉన్నాయి. భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే పాకిస్థాన్‌కు అందాల్సిన భారీ నిధులను నిలిపివేయడంతో పాటు, భవిష్యత్తులో జరిగే ఐసీసీ టోర్నీల నుంచి ఆ దేశాన్ని బహిష్కరించే అవకాశం ఉందని ఐసీసీ సంకేతాలిచ్చింది. దీనికి తోడు శ్రీలంక, యూఏఈ వంటి మిత్రదేశాల నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. ఈ మ్యాచ్ రద్దయితే ఆతిథ్య దేశమైన శ్రీలంకకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని.. క్రీడా స్ఫూర్తిని గౌరవించాలని అవి విజ్ఞప్తి చేయడంతో పాక్ తన మొండిపట్టును వీడాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్ వివాదం.. కొత్త నాటకం
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మద్దతుగా తాము భారత్‌తో ఆడబోమని మొదట ప్రకటించిన పాకిస్థాన్.. ఇప్పుడు దానికి ఒక వింత కారణాన్ని సాకుగా చూపుతోంది. ఐసీసీ ప్రతినిధులు, ఇతర దేశాల బోర్డు సభ్యులు లాహోర్‌కు వచ్చి చర్చలు జరపడంతో వచ్చిన అతిథులను గౌరవించడం మా సంప్రదాయమని కొత్త పల్లవి అందుకుంది. అతిథుల కోరిక మేరకే పాత చేదు జ్ఞాపకాలను మరిచిపోయి భారత్‌తో ఆడుతున్నట్లు మొహ్సిన్ నఖ్వీ తన మాట మార్చారు. వాస్తవానికి ఇది ఐసీసీ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలాగైతేనేం.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మ్యాచ్ నిర్వహణపై ఉన్న నీలినీడలు తొలగిపోయాయి.
ఫిబ్రవరి 15న కొలంబోలో రణరంగం
అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం భారత్-పాక్ సమరానికి వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2022 ఆసియా కప్ నుంచి చూస్తే భారత్‌పై పాకిస్థాన్‌కు మెరుగైన రికార్డు లేదు. వరుస ఓటములతో కుంగిపోతున్న పాక్, ఈసారి సైనిక బలం కంటే తమ ఆట బలంతో భారత్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు పటిష్టమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా, దాయాది జట్టుపై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని పట్టుదలతో ఉంది.