T20 World Cup 2026: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ క్రికెట్ జట్టూ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో పాకిస్థాన్ జట్టు పరువును గంగలో కలిపేలా ఉండగా.. మరోవైపు నెదర్లాండ్స్ వారు ఆడిన ఆటతీరు ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో పాకిస్థాన్ క్రికెటర్లు చాలా పాతబడిన బస్సులో ప్రయాణించడం ఆపై ఒక శిథిలావస్థలో ఉన్న భవనం లేదా పారిశ్రామిక ప్రాంతంలా కనిపిస్తున్న ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్లడం చూడవచ్చు. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. "పాకిస్థాన్ ప్లేయర్లు స్టేడియానికి వెళ్తున్నారా లేక ఏదైనా సిమెంట్ ఫ్యాక్టరీలో కూలీ పనులకు వెళ్తున్నారా?" అంటూ ఎగతాళి చేస్తున్నారు. శ్రీలంక వంటి దేశం అంతర్జాతీయ క్రికెటర్లకు కనీసం మంచి బస్సు సౌకర్యం కూడా కల్పించలేదా అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు మాత్రం పాక్ బోర్డు ఆర్థిక పరిస్థితిపై జోకులు పేలుస్తున్నారు. అయితే ఇది నిజంగానే హోటల్ వసతికి సంబంధించిందా లేక స్టేడియం వెనుక ఉన్న ఏదైనా పాత దారి గుండా వారు వెళ్తున్నారా అన్నది అధికారికంగా ధ్రువీకరించబడలేదు.

నెదర్లాండ్స్ జట్టుతో చెమటోడ్చిన పాక్
కేవలం ఆతిథ్యం విషయంలోనే కాకుండా ఆటలోనూ పాకిస్థాన్ తడబడుతోంది. తమ తొలి మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌ను ఎదుర్కోవడానికి పాకిస్థాన్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 147 పరుగుల మోస్తరు స్కోరు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరి ఓవర్లలో ఫహీమ్ అష్రఫ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోతే పాక్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చేది. కేవలం మూడు వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ.. ఈ ఆటతీరు చూస్తుంటే భారత్ వంటి బలమైన జట్టుతో తలపడటం పాకిస్థాన్‌కు సవాలుతో కూడుకున్న పని అని విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్-పాక్ సమరం: రాజకీయ మలుపుల తర్వాత గ్రీన్ సిగ్నల్
భారత్-పాక్ మ్యాచ్ నిర్వహణపై గత కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత్‌తో తలపడేందుకు మొదట పాకిస్థాన్ ప్రభుత్వం నిరాకరించింది. అయితే ఐసీసీ, శ్రీలంక, యూఏఈ వంటి దేశాల ఒత్తిడికి తలొగ్గి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం యూ-టర్న్ తీసుకుంది. క్రికెట్ స్ఫూర్తిని కాపాడటానికి తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రకటించింది. దీంతో ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనున్న మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. 2022 ఆసియా కప్ తర్వాత ఇప్పటివరకు భారత్‌పై గెలవని పాక్, ఈసారైనా ఆ రికార్డును మారుస్తుందో లేదో వేచి చూడాలి.