
హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది రెండేళ్ల క్రితమే క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, అడపా దడపా టీ20 మ్యాచ్‌ల్లో ఆడుతోన్న సంగతి తెలిసిందే. మే 31న లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో 'హరికేన్ రిలీఫ్ టీ20 ఛాలెంజ్' పేరిట వెస్టిండిస్‌తో తలపడే వరల్డ్ ఎలెవన్ తుది జట్టులో షాహిద్ అఫ్రిదికి ఐసీసీ చోటు కల్పించింది.
అయితే, మోకాలి నొప్పి కారణంగా తాను ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని అఫ్రిది ప్రకటించాడు. దుబాయ్‌లో డాక్టర్‌కు చూపించుకున్నానని, గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు మరో మూడు నాలుగు వారాలు పడుతుందని ట్వీట్ చేస్తూ వెస్టిండిస్‌తో జరిగే చారిటీ మ్యాచ్‌లో ఆడే పరిస్థితి లేదని పేర్కొన్నాడు.
కానీ, తాజాగా శుక్రవారం ఆఫ్రది మరో ట్వీట్ చేస్తూ వెస్టిండిస్‌తో జరిగే మ్యాచ్‌లో తాను ఆడబోతున్నట్టు ట్వీట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. 'అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోమని అల్లా చెప్పాడని, అందుకోసం తనకున్న శక్తులన్నింటినీ ఉపయోగిస్తాను' అని అఫ్రిది పేర్కొన్నాడు.
కాగా, మే 31న జరగనున్న చారిటీ మ్యాచ్‌కు ఐసీసీ అంతర్జాతీయ హోదా ఇచ్చిన సంగతి తెలిసిందే. వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే నిధులను వెస్టిండీస్‌లోని క్రికెట్ మైదానాల పునరుద్ధరణ పనులకు ఉపయోగించనున్నారు.
గతేడాది ఇర్మా తుఫాను వల్ల కరేబియన్ దీవుల్లోని ఐదు క్రికెట్ మైదానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆంగ్విలాలోని రొనాల్డ్ వెబ్‌స్టర్ పార్క్, ఆంటిగ్వాలోని సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియం, డొమినికాలోని విన్డ్‌సర్ పార్క్ స్టేడియం, బీవీఐలోని షిర్లే రిక్రియేషన్ గ్రౌండ్, సెయింట్ మార్టిన్‌లోని కారిబ్ లంబర్ బాల్ పార్క్ మైదానాలు తుపాను దాటికి దెబ్బతిన్నాయి.
వీటిని పునరుద్ధరణ పనుల కోసం నిధుల సేకరణలో భాగంగా ఐసీసీ వెస్టిండీస్, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవెన్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. పాకిస్తాన్ నుంచి షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిదీ, తిసారా పెరీరా(శ్రీలంక), షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్(బంగ్లాదేశ్), రషీద్ ఖాన్ (అప్ఘనిస్తాన్)లను ఎంపిక చేయగా భారత్ నుంచి పాండ్యా, కార్తీక్‌లకు అవకాశం కల్పించింది.
ప్రతి దేశం నుంచి ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు, వరల్డ్ ఎలెవన్ ఢీకొనబోతున్న 13 మంది సభ్యులతో కూడిన వెస్టిండిస్ జట్టుని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కార్లోస్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. క్రిస్ గేల్, మార్లోన్ శామ్యూల్స్, ఆండ్రూ రసెల్ వంటి హేమాహేమీలు జట్టులో ఉన్నారు.
వరల్డ్ ఎలెవన్ తుది జట్టు:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), షకీబుల్ హసన్, తమీమ్ ఇక్బాల్, తిసార పెరీరా, రషీద్ ఖాన్, హర్దీక్ పాండ్యా, లూక్ రోంచి, మెక్లినగన్
వెస్టిండిస్:
కార్లోస్ బ్రాత్‌వైట్, రయాద్ ఎమ్రిత్, ఆండ్రూ ఫ్లెచర్, క్రిస్‌గేల్, ఎవిన్ లూయిస్, అశ్లే నర్స్, కీమోపాల్, రోవ్‌మాన్ పొవెల్, దినేష్ రామ్‌డిన్ (వికెట్ కీపర్), ఆండ్రూ రస్సెల్, సామ్యుల్ బద్రీ, మార్లాన్ సామ్యుల్స్, కెస్రిక్ విలియమ్స్