కోహ్లీపై అమీర్ ప్రశంసలు
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ స్టార్ పేసర్ మహ్మద్ అమీర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీని సోదరుడా అంటూ సంభోదించిన అమీర్ రాబోయే తరానికి నీవు నిజమైన నాయకుడివంటూ కొనియాడాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ యువ క్రికెటర్లకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు. అలాగే కోహ్లీ మైదానంలో ఎప్పటికీ ఆడుతూ ఉండాలని అమీర్ ఆశించాడు. కాగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని అమీర్ ఔట్ చేసిన సంగతి తెలిసిందే.

కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ
ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్సీకి దూరమైన విరాట్ కోహ్లీ శనివారం టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించి యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ మేరకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా కోహ్లీ వెల్లడించాడు. తన ఏడేళ్ల కెప్టెన్సీ ప్రయాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కోహ్లీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. ముఖ్యంగా తనను కెప్టెన్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కృతజ్ఞతలు చెప్పాడు. అలాగే తాను గెలవడానికి ప్రతి మ్యాచ్‌లో 100కు 120 శాతం కృషి చేశానని చెప్పుకొచ్చాడు.

ముగిసిన కోహ్లీ శకం
కాగా విరాట్ కోహ్లీ తాజాగా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కెప్టెన్‌గా అతని శకం ముగిసిందనే చెప్పుకోవాలి. 2021 టీ20 వరల్డ్ కప్ కొనసాగుతున్న టైంలోనే తాను ఇక టీ20 ఫార్మాట్‌గా కెప్టెన్‌గా ఉండబోనని విరాట్ ప్రకటించాడు. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి సెలెక్టర్లే కోహ్లీని తప్పించారు. దీంతో ఇక టీమిండియా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. కనుక టీంలో కోహ్లీ ఇక సాధారణ ఆటగాడిగానే కొనసాగనున్నాడు. కాగా ఇప్పటికే వన్డే, టీ20లకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌శర్మనే టెస్టు ఫార్మాట్‌కు కూడా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications












