అడిలైడ్: అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి పాకిస్ధాన్ క్రికెట్ దిగ్గజాలు మిస్బావుల్ హక్, షాహిద్ అఫ్రిది రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ వరల్డ్ కప్‌లో పాకిస్ధాన్ జట్టుకు కెప్టెన్ మిస్బా ముందుండి నడిపించడమే కాకుండా, పాకిస్ధాన్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
మిస్బావుల్ హక్ వన్డేల్లో 162 వన్డేలు ఆడారు. వీటిలో 42 అర్ధ సెంచరీలు చేయగా, ఒక్క సెంచరీ కూడా చేయలేదు. వన్డేల్లో హక్ చేసిన పరుగులు 5,122. వన్డేల్లో మిస్బావుల్ హక్ అత్యధిక స్కోరు 96 పరుగులు మాత్రమే.

ఇక వరల్డ్ కప్‌లో పాకిస్ధాన్-యూఏఈ మ్యాచ్‌లో పాకిస్ధాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డు సృష్టించాడు. ఆల్ రౌండర్‌గా అటు బ్యాట్‌తోనూ, ఇటు బాల్‌తోనూ ఒంటి చేత్తో పాకిస్ధాన్‌కు ఎన్నో విజయాలను అందించిన షాహిద్ అఫ్రిది వన్డేల్లో 8వేల పరుగుల మైలురాయిని సాధించిన విషయం తెలిసిందే.
దీంతో వన్డేల్లో 8వేల పరుగుల మైలురాయిని సాధించి, 350కు పైగా వికెట్లు తీసుకున్న ఏకైక ఆటగాడు షాహిద్ అఫ్రిదినే. ఇప్పటి వరకు 395 వన్డేలాడిన షాహిద్ అఫ్రిది మొత్తం 8019 పరుగులు చేశాడు. ఇందులో 39 అర్ధ సెంచరీలు, 6 సెంచరీలు ఉండటం విశేషం.
బౌలర్‌గా ఇప్పటి వరకు వన్డేల్లో 393 వికెట్లను తీసుకున్నాడు. పాకిస్ధాన్ జట్టు తరుపున 8వేల పరుగులు క్లబ్‌లో చేరిన నాల్గవ ఆటగాడు షాహిద్ అఫ్రిది. వన్డేల్లో 8వేల పరుగులతో పాటు, 300కు పైగా వికెట్లు తీసుకున్న రెండవ ఆటగాడు. ప్రస్తుతం పాకిస్ధాన్ ట్వంటీ 20 జట్టుకు కెప్టెన్‌గా షాహిద్ అఫ్రిది ఉన్నారు.
ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్టేలియా Vs పాకిస్ధాన్ జట్ల మధ్య మ్యాచ్‌లో పాక్‌పై ఆసీస్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీస్‌కు అర్హత సాధించింది. బ్యాటింగ్ వైఫల్యం, ఫీల్డింగ తప్పిదాలు, కీలక సమయాల్లో క్యాచ్‌లను జారవిడవడంతో పాకిస్ధాన్ భారీ మూల్యం చెల్లించుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్ధాన్ 49.5 ఓవర్లలో 213 పరుగులకే ఆలౌట్ అవగా, ఆ తర్వాత 214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్టేలియా 33.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్ని చేధించింది. దీంతో సెమీస్‌లో ఆతిథ్య జట్టు ఆస్టేలియాతో భారత్ ఆడనుంది. ఈ మ్యాచ్ మార్చి 26 (గురువారం) సిడ్నీ వేదికగా జరగనుంది.