హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 0-3తో ఓటమి పాలైంది. దీంతో తాజా ఐసీసీ ర్యాంకుల్లో పాకిస్థాన్ రెండు స్ధానాలను కోల్పోయి ఐదో ర్యాంకుకు పడిపోయింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది.
సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో పాకిస్థాన్ 220 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ జాబితాలో పాకిస్థాన్ 97 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానానికి దిగజారింది. అంతకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కూడా 0-2తో కోల్పోయింది. మిస్బా కెప్టెన్సీలో పాక్ చివరగా ఆడిన ఆరు టెస్టుల్లో ఓటమిపాలైంది.

120 రేటింగ్ పాయింట్లతో టీమిండియా నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతుండగా, 109 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్ధానంలో నిలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా (102), ఇంగ్లాండ్ (101) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్ (96), శ్రీలంక (96) కేవలం ఓ రేటింగ్ పాయింట్ వెనుకబడి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఐసీసీ టెస్టు ర్యాంకుల జాబితా (జనవరి 7) నాటికి:
1. భారత్
2. ఆస్ట్రేలియా
3. దక్షిణాఫ్రికా
4. ఇంగ్లాండ్
5 పాకిస్థాన్
6. న్యూజిలాండ్
7. శ్రీలంక
8. వెస్టిండిస్
9. బంగ్లాదేశ్
10. జింబాబ్వే