హైదరాబాద్: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ నుంచి పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆమీర్ దూరమయ్యాడు. కుడికాలి పిక్క గాయంతో బాధపడుతున్న ఆమిర్‌కు శ్రీలంకతో జరిగే ఐదు వన్డేల సిరీస్ నుంచి విశ్రాంతినిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టుకు దూరమైన ఆమీర్‌ను వన్డే సిరిస్ నుంచి కూడా తప్పిస్తున్నట్లు పీసీబీ అధికారిక ప్రకటన చేసింది. అయితే ఆమీర్ స్ధానంలో ఉస్మాన్ ఖాన్‌కు చోటు కల్పించారు. కాగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ 21 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

136 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 114 పరుగులకే ఆలౌటైంది. మరొవైపు రెండో టెస్టులో కూడా పాకిస్థాన్‌పై శ్రీలంక తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 482 పరుగులు చేయగా, పాకిస్తాన్ 262 పరుగులు చేసింది.
మూడోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 34 పరుగులు చేసింది. పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య అక్టోబర్ 13 నుంచి దుబాయి వేదికగా వన్డే సిరిస్ ప్రారంభం కానుంది.