లాహోర్: పాకిస్థాన్ జాతీయ క్రికెట్ శిబిరంలో మొహమ్మద్ అమీర్ చేరికపై వివాదం చల్లారడం లేదు. అతడుంటే శిబిరానికి హాజరుకానని ఇంతకుముందు తెగేసి చెప్పిన ఆ జట్టు వన్డే కెప్టెన్ అజహర్ అలీ మరో అడుగు ముందుకేశాడు. సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగేందుకు మంగళవారం సిద్ధమయ్యాడు.
పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్‌తో సమావేశమయ్యాడు. రాజీనామా నిర్ణయాన్ని చెప్పాడు. అందుకు షహర్యార్ ఖాన్ ఒప్పుకోలేదు. అజహర్‌కు నచ్చచెప్పడంతో వెనక్కి తగ్గాడని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. ఫిక్సింగ్ నేరంపై ఐదేళ్ల నిషేధం పూర్తయిన నేపథ్యంలో పీసీబీ మొహమ్మద్ అమీర్‌ను శిబిరానికి ఎంపిక చేసింది.
అజహర్‌తో పాటు మహ్మద్ హఫీజ్ కూడా అతడి పునరాగమనాన్ని వ్యతిరేకించాడు. వీళ్లిద్దరూ ఆమీర్‌తో కలిసి సాధన చేయమని చెప్పి శిబిరాన్ని బహిష్కరించారు.
వాళ్లిద్దరికీ క్షమాపణలు చెప్పిన అమీర్... తాను పాకిస్థాన్ జట్టుకు ఆడేందుకు అర్హుడిని కాదంటే ఆటను వదిలేయడానికి సిద్ధమేనని చెప్పాడు. మరోవైపు పాకిస్థాన్ జట్టులో పునరాగమనంపై ఆమీర్‌కు మార్గం సుగమమైంది. ఫిక్సింగ్‌లో శిక్ష అనుభవించిన అతడిని జాతీయ జట్టులోకి ఎంపిక చేయకుండా ఆదేశించాలని ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
పాకిస్తాన్ జాతీయ క్రికెట్ శిబిరంలో మొహమ్మద్ అమీర్ చేరిక పైన వివాదం తారాస్థాయికి చేరుకుంటోన్న విషయం తెలిసిందే. అమీర్ అంశంపై టీవీ చర్చలోనే పాక్ మాజీ క్రికెటర్లు రమీజ్ రాజా, మొహమ్మద్ యూసుఫ్ తీవ్ర వాగ్వాదానికి దిగారు కూడా.

ఒకరి పైన మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. వారి తీరుకు టీవీ యాంకర్ బిత్తరపోయారు. పాకిస్థాన్, న్యూజిలాండ్ సిరీస్ సందర్భంగా వీరిద్దరూ మ్యాచ్ గురించి విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ గురించి చర్చ వచ్చింది.
ఈ సందర్భంగా రమీజ్ రాజా మాట్లాడుతూ... ఎవరైతే గడ్డం పెంచుకుంటారో వారు అబద్ధాలకు దూరంగా ఉండాలని యూసఫ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో అగ్గి రాజుకుంది. వెంటనే యూసఫ్ మాట్లాడుతూ.. సిగ్గుమాలిన పనులు చేసేవారే నీలా అర్థం లేకుండా మాట్లాడుతారన్నారు.
నీకు క్రికెట్ ఆడే సామర్థ్యమే లేదని, మాటకారితనంతో మాయ చేస్తున్నావని, నీకు గడ్డం పెంచే అర్హత లేదని, నువ్వు పాకిస్థాన్ క్రికెట్ కు చేసిందేమీ లేదని, 57 టెస్టుల్లో కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేశావని, అసలు ప్రముఖ క్రికెటర్‌వి ఎలా అయ్యావో చూడాలని ఉందని, నువ్వు క్రికెటర్‌వి కాదని, ఇంగ్లీష్ టీచర్‌వంటూ యూసుఫ్ నిప్పులు చెరిగాడు.
రమీజ్ రాజా స్పందిస్తూ... నువ్వేం మాట్లాడినా ఫర్వాలేదని, పాకిస్థాన్ క్రికెట్‌లో చీడ పురుగు మాదిరిగా తయారయ్యావన్నాడు. దానికి రమీజ్ రాజా స్పందిస్తూ... అవును, నాకు క్రికెట్ సర్వస్వం, అది తప్ప ఇంకోటి తెలియదని, నీకు అదే తెలియదని ఎద్దేవా చేశాడు. యాంకర్ ఎలాగోలా సర్ది చెప్పి విశ్లేషణ ముగించారు. ఇది తీవ్ర దుమారం రేపుతోంది.