పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కురిపించిన ప్రశంసలు ఇప్పుడు నవ్వులపాలవుతున్నాయి. ఆస్ట్రేలియా బీ జట్టుపై సాధించిన విజయాన్ని ఏదో ప్రపంచ కప్ గెలిచినంత రేంజ్‌లో పొగుడుతూ పాక్ ప్రధాని సోషల్ మీడియాలో అభాసుపాలయ్యారు. ఆయన చేసిన ట్వీట్ నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురవుతోంది. దీనిపై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే?
లాహోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ.. "ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమ్ పాకిస్థాన్‌కు అభినందనలు. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కృషి అమోఘం. దేశం గర్వించదగ్గ క్షణం ఇది" అంటూ ఎక్స్ (X) లో పోస్ట్ చేశారు.

ఆకాష్ చోప్రా 'పోస్టుమార్టం'
పాక్ ప్రధాని ట్వీట్‌పై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఆస్ట్రేలియా తన ప్రధాన ఆటగాళ్లు లేకుండా 'బీ' టీమ్‌తో ఆడుతోందన్న నిజాన్ని ఆయన గుర్తు చేస్తూ చురకలు అంటించారు. "గౌరవంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.. ఇది ఆస్ట్రేలియా 'బీ' టీమ్‌తో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే. ప్రధాన ఆటగాళ్లు ఎవరూ ఈ జట్టులో లేరు. కేవలం 170 పరుగుల మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో గెలవడాన్ని 'అద్భుతమైన ప్రదర్శన' అని పిలవలేం." అని భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా 'బీ' టీమ్ ఎందుకు?
టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. అయితే బిగ్ బాష్ లీగ్ ఫైనల్స్, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా కీలక ఆటగాళ్లు ఈ పర్యటనకు దూరమయ్యారు. కెప్టెన్ మిచెల్ మార్ష్ ఇంకా జట్టుతో చేరలేదు, దాంతో ట్రావిస్ హెడ్ కెప్టెన్సీ చేపట్టాడు.ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ వంటి స్టార్ బౌలర్లు జట్టులో లేరు. గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్ ఆడలేదు.
కేవలం ద్వైపాక్షిక సిరీస్‌లో, అది కూడా బలహీనమైన ఆస్ట్రేలియా జట్టుపై గెలిచినందుకు ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంతలా స్పందించడంపై స్వయంగా పాక్ అభిమానులే విమర్శలు గుప్పిస్తున్నారు. "భారత్‌తో ఆడి గెలవలేక, ఇలాంటి చిన్న విజయాలను చూసి మురిసిపోతున్నారు" అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.