
హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ 20ల సిరీస్‌ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన చివరి టీ20లో పాకిస్తాన్ 18 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 181 పరుగులు చేసింది.
పాక్ ఆటగాళ్లైన ఫకార్ జమాన్(46) రాణించగా, సర్ఫరాజ్ అహ్మద్(29), ఉమర్ అమిన్(21), హారిస్ సోహైల్(20 నాటౌట్), అహ్మద్ షెహజాద్(19), బాబర్ అజమ్(18)లు ఫర్వాలేదనిపించారు. ఆ పై లక్ష్య ఛేదనలో కివీస్ 163 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. మార్టిన్ గప్టిల్(59) హాఫ్ సెంచరీ సాధించగా, రాస్ టేలర్(25), సాంత్నార్(24 నాటౌట్)లు మోస్తరుగా ఆడారు.
అంతకుముందు జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ వైట్‌వాష్ అయిన సంగతి తెలిసిందే. దాంతో ట్వంటీ 20 సిరీస్‌ను కూడా కివీస్ సునాయాసంగా గెలుస్తుందని భావించారు. కాగా, అంచనాలు తారుమారు చేస్తూ పాకిస్తాన్ వరుస రెండు విజయాలతో సిరీస్‌ను 2-1తో సాధించింది. ఫలితంగా వన్డేల్లో ఎదురైన ఘోర పరాభవానికి పాకిస్తాన ప్రతీకారం తీర్చుకుంది. ఈ తాజా సిరీస్ విజయంతో ట్వంటీ 20ల్లో పాకిస్తాన్ నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. అదే క్రమంలో న్యూజిలాండ్ రెండో ర్యాంకు పడిపోయింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.