హైదరాబాద్: ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగిన సంగతి తెలిసిందే. పైనల్లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. అయితే భారత్‌పై సాధించిన విజయానికి గుర్తుగా పాకిస్థాన్ ప్రభుత్వం గురువారం పోస్టల్ స్టాంప్‌లను విడుదల చేసింది.
పాకిస్థాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం ఇదే తొలిసారి. దీంతో తొలిసారి ఛాంపియన్ ట్రోఫీ విజేతగా లిచిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు జ్ఞాపకార్థం 50000 సావనీర్ షీట్స్, 3 లక్షల స్టాంప్‌లను విడుదల చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో భాగంగా మూడు స్టాంప్‌లున్న సెట్ రూ. 30, సావనీర్ షీట్ ధర రూ.50గా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను పాకిస్థాన్ ప్రభుత్వం ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ప్రభుత్వం విడుదల చేసిన స్టాంప్ ఫోటోలను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
ది ఓవల్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టాస్ గెలిచిన కోహ్లీసేన పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 338 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 72 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది.
అయితే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో 30.3 ఓవర్లలోనే 158 పరుగులకి భారత్ ఆలౌటైంది. దీంతో తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా పాకిస్థాన్ అవతరించింది. అయితే ఈ టోర్నీకి గుర్తుగా పాక్ స్టాంప్‌లు విడుదల చేసినా... భారత్‌ను కవ్వించడానికేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.