పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ చరిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో బంగ్లా క్లీన్‌స్వీప్ చేసింది. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో పాక్‌ను బంగ్లా ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి సిరీస్ విజయం.అయితే సొంతగడ్డపై ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్థాన్ తమ పేరిట కోరుకోని రికార్డులు నమోదు చేసుకుంది.
గత ఆరు దశాబ్దాల్లో టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ దారుణమైన ప్రదర్శన ఇదే అని ఐసీసీ పేర్కొంది. బంగ్లా చేతిలో ఘోర ఓటమితో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో పాక్ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. బంగ్లా సిరీస్ ప్రారంభానికి ముందు ఆరో స్థానంలో నిలిచిన పాక్ ఏకంగా రెండు స్థానాలను కోల్పోయింది. 1965 తర్వాత టెస్టు ర్యాంకింగ్స్‌లో పాక్‌కు ఇదే దారుణమైన ర్యాంక్.

స్వదేశంలో పాకిస్థాన్ విజయం లేకుండా వరుసగా పదో టెస్టు ముగించింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో సొంతగడ్డపై 2021 నుంచి పాక్‌కు గెలుపు దక్కలేదు. గత పది మ్యాచ్‌ల్లో ఆరింట్లో ఓటమి పాలైంది. నాలుగ మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చేతిలో సిరీస్‌లను కోల్పోయింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌ను డ్రాగా ముగించింది. ఇక తాజాగా బంగ్లాదేశ్ చేతిలోనూ సిరీస్ కోల్పోయింది. ఈ ఓటమితో.. సొంతగడ్డపై ఐసీసీ పాత పది పూర్తి సభ్య దేశాల చేతిలో ఓడిన రెండో జట్టుగా చరిత్రకెక్కింది. ఈ చెత్త రికార్డు పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్ పేరిట కూడా ఉంది.
కాగా, ఓవర్‌నైట్ స్కోరు 42/0తో అయిదో రోజు 185 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (22 నాటౌట్, 51 బంతుల్లో, 1 ఫోర్), షకిబ్ అల్ హసన్ (21 నాటౌట్, 43 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) జట్టును విజయతీరాలకు చేర్చారు. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 274, బంగ్లాదేశ్ 262 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 172 పరుగులకే కుప్పకూలింది.