T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 వేదికల మార్పు విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ కు తమ జట్టును పంపే ప్రసక్తే లేదని.. అవసరమైతే టోర్నమెంట్‌ను బహిష్కరిస్తామని స్పష్టం చేసింది. అయితే ఈ విషయంలో బంగ్లాదేశ్‌ను వెనకుండి నడిపిస్తున్నట్లు భావిస్తున్న పాకిస్థాన్ ఇప్పుడు తన వైఖరిని మారుస్తున్నట్లు కనిపిస్తోంది.
అసలు వివాదం ఏంటి?
బంగ్లాదేశ్ తన ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ నుంచి వేరే దేశానికి మార్చాలని ఐసీసీని కోరింది. ఈ క్రమంలో షెడ్యూల్ ఇప్పటికే ఖరారైందని.. వేదికలు మార్చలేమని ఐసీసీ బోర్డు మీటింగ్‌లో తేల్చిచెప్పింది. ఐసీసీ నిర్ణయం మార్చుకోకపోతే తాము వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వం, క్రికెట్ బోర్డు ప్రకటించాయి.

పాకిస్థాన్ యూ-టర్న్?
తొలుత బంగ్లాదేశ్‌కు అండగా నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB).. ఇప్పుడు మెల్లగా తన దారి తాను చూసుకుంటున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ వరల్డ్ కప్ ఆడకపోతే, తాము కూడా బహిష్కరిస్తామని పాకిస్థాన్‌కు చెందిన కొన్ని మీడియా సంస్థలు గతంలో పేర్కొన్నాయి. తాజా నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌కు ప్రపంచకప్ బహిష్కరించే ఉద్దేశం లేదని తెలుస్తోంది. "ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్ మొండిపట్టు వల్ల మా మ్యాచ్‌లు దుబాయ్‌కి మారాయి. ఆ సూత్రం ఆధారంగానే మేము బంగ్లాదేశ్‌కు మద్దతు ఇచ్చాం. కానీ వరల్డ్ కప్ ఆడకూడదనే ఆలోచన మాకు లేదు" అని పాక్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌కు 'వెన్నుపోటు' తప్పదా?
బంగ్లాదేశ్ తన నిర్ణయానికి కట్టుబడి టోర్నీ నుంచి తప్పుకుంటే.. పాకిస్థాన్ మాత్రం భారత్‌లో అడుగుపెట్టి మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఇదే జరిగితే బంగ్లాదేశ్ ఒంటరి పోరాటం చేసినట్లవుతుంది. "బంగ్లాదేశ్‌ను ఉసిగొల్పి పాకిస్థాన్ తన పబ్బం గడుపుకుంటోందా?" అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.