పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఘోర తప్పిదం జరిగింది. ఎవరూ ఊహించని తప్పు చేసి పాకిస్థాన్ బోర్డు నవ్వులపాలైంది. అసలేం జరిగిందంటే.. గురువారం కరాచీ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో కరాచీ కింగ్స్ తలపడింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అయిదు వికెట్ల తేడాతో గ్లాడియేటర్స్ నెగ్గింది. విజయానికి ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమవ్వగా రూథర్‌ఫర్డ్ (58*; 31 బంతుల్లో) సిక్సర్ల మోత మోగించి కెట్వా గ్లాడియేటర్స్‌ను గెలిపించాడు.
అయితే క్వెట్టా గ్లాడియేటర్స్ విజయానికి చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో విన్ ప్రిడిక్షన్‌ను స్క్రీన్‌పై డిస్‌ప్లే చేశారు. కరాచీ గెలుపు శాతం -1%గా, అలాగే క్వెట్టా విజయావకాశాలు 101% చూపించారు. శాతాన్ని 100తో కొలుస్తారు. కానీ పాకిస్థాన్ సూపర్ లీగ్ 100 శాతాన్ని అధిగమించడం గమనార్హం. కొత్తగా ట్రై చేయాలని భావించారో లేదా కనీస గణిత జ్ఞానం లేకుండా చేశారో తెలియదు .

మరోవైపు ఈ విషయంపై పాకిస్థాన్ బోర్డు, లీగ్‌పై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. అందుకే ఏ విషయంలోనైనా చదువు ముఖ్యమని చెబుతుంటారని, ముందు చదువుకోండి అంటూ నెటినన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. విన్స్ (37; 25 బంతుల్లో) టాప్ స్కోరర్. మహ్మద్ నవాజ్ (28; 19 బంతుల్లో), అన్వర్ అలీ (25*; 14 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు. క్వెట్టా బౌలర్లలో అబ్రర్ అహ్మద్ మూడు వికెట్లతో సత్తాచాటాడు.
అనంతరం ఛేదనలో ఆఖరి బంతికి అయిదు వికెట్లు కోల్పోయి క్వెట్టా గ్లాడియేటర్స్ విజయం సాధించింది. రూథర్‌ఫర్డ్ (58*; 31 బంతుల్లో), జేసన్ రాయ్ (52; 31 బంతుల్లో) అర్ధశతకాలతో చెలరేగారు. రూథర్‌ఫర్డ్‌తో కలిసి అకెల్ హొసెన్ (22*; 17 బంతుల్లో) జట్టును విజయతీరాలకు చేర్చాడు. హసన్ అలీ, జహీద్ మహ్మద్ చెరో రెండు వికెట్లు తీశారు.