పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా ఆసీస్ తో మూడు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 14 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రాక్టీస్ లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ XIతో పాకిస్థాన్ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. అయితే ఆ మ్యాచ్ స్కోరు బోర్డులో PAKకి బదులుగా PAKI అని స్కోరు బోర్డులో వచ్చింది. దాంతో వివాదం మొదలైంది
PAKI పదంతో ఉన్న లైవ్ స్కోర్ టికర్ ను గమనించిన ఓ ఆస్ట్రేలియా రిపోర్టర్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ గా మారింది. రేసిజం కిందకు వస్తుందని, పాకిస్థాన్ ను అవమానిస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పాక్ లేక దక్షిణాసియా జాతీయులను ఇంగ్లాండ్ లో పాకీ అని సంభోదిస్తుంటారు.

అయితే ప్రసార కర్త ఫాక్స్ న్యూస్ ఇది టెక్నికల్ పొరపాటుగా చెప్పింది. అయితే వివాదం తీవ్రంగా మారుతుండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) క్షమాపణలు చెప్పింది. ఆ తప్పిదాన్ని సవరించామని వివరించింది. కాగా, ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తీరుపై మరికొన్ని విమర్శలు వచ్చాయి. పాకిస్థాన్ ఆటగాళ్లకు స్వాగతం పలకడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, లగేజిని ప్లేయర్లే మోసుకుంటూ వెళ్లిపోయారని పాక్ అభిమానులు ఆసీస్ బోర్డుపై ఫైర్ అయ్యారు.
ఇక పాకిస్థాన్- ప్రైమ్ మినిస్టర్ XI మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్ హొరాహొరీగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 391 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కెప్టెన్ మసూద్ డబుల్ సెంచరీ సాధించాడు. సర్ఫరాజ్ అహ్మద్ 41, బాబార్ అజామ్ 40 పరుగులు చేశారు.
ప్రైమ్ మినిస్టర్ XI జట్టు కూడా పరుగుల వరద పారిస్తుంది. మూడో రోజు థర్డ్ సెషన్ కొనసాగుతున్న టైమ్ కి నాలుగు వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. సెంచరీ సాధించిన రెన్షా (112) క్రీజులో కొనసాగుతున్నాడు.