ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. వన్డే ఇంటర్నేషనల్స్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయంలో భారత్‌ను వెనక్కి నెట్టింది బాబర్ ఆజమ్ సేన. వన్డేల్లో నంబర్ 1 స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుస విజయాలను సాధిస్తోన్న నేపథ్యంలో ఆ జట్టు ర్యాంక్ మెరుగుపడింది.
ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. అయిదు చొప్పున టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ ఆడటానికి కివీస్.. పాక్‌లో అడుగుపెట్టింది. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ సమం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లల్లో పాకిస్తాన్ విజయం సాధించగా.. మూడు, అయిదు మ్యాచ్‌లను న్యూజిలాండ్ తన ఖాతాలో వేసుకుంది. నాలుగో మ్యాచ్ రద్దయింది.

తాజాగా- ఈ రెండు జట్ల మధ్య వన్డే ఇంటర్నేషనల్స్ ఆరంభం అయ్యాయి. అయిదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వరుసగా నాలుగింట్లో ఘన విజయాన్ని సాధించింది పాకిస్తాన్. శుక్రవారం రాత్రి కరాచీలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. కేప్టెన్ బాబర్ ఆజమ్ సెంచరీతో చెలరేగాడు. 117 బంతుల్లో 10 ఫోర్లతో 107 పరుగులు చేశాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్- టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. 43.4 ఓవర్లల్లో 232 పరుగులకు ఆలౌట్ అయింది. 60 పరుగులు చేసిన కేప్టెన్ టామ్ లాథమ్ టాప్ స్కోరర్, మార్క్ ఛాప్‌మన్-46, డారిల్ మిఛెల్- 34, టామ్ బ్లండెల్-23 పరుగులు చేశారు. అయిదు వన్డేల ఈ సిరీస్‌ను ఇప్పటికే 4-0 తేడాతో గెలుచుకుంది పాకిస్తాన్. చివరిదైన అయిదో వన్డే ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఇదే కరాచీ స్టేడియంలో జరుగనుంది.
ఈ వరుసగా విజయాలతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ అగ్రస్థానానికి ఎగబాకింది. 2005లో ఐసీసీ ర్యాంకింగ్స్ విధానాన్ని ప్రవేశపెట్టగా.. ఇప్పటివరకు టాప్ పొజీషన్‌ను అందుకోలేదా జట్టు. ఇప్పుడు ఆ కొరతను తీర్చుకుంది. 113.48 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. చివరి వన్డేలో ఓడినా ఈ పాయింట్లల్లో పెద్దగా తేడా రాదు. 113.28 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. 112.63 పాయింట్లతో భారత్ మూడో స్థానంలో నిలిచింది.
ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్‌లో కూడా పాకిస్తాన్ ప్లేయర్లదే హవా. ఈ ఫార్మట్‌లో కేప్టెన్ బాబర్ ఆజమ్ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో అయిదు, టీ20 ఇంటర్నేషనల్స్‌లో మూడో స్థానంలో నిలిచాడు. టెస్ట్, టీ20 ఫార్మట్‌లో మాత్రం టీమిండియాదే ఆధిపత్యం. ఈ రెండు చోట్ల భారత్ నంబర్ 1 జట్టుగా కొనసాగుతోంది. తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.