
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ భారత క్రికెట్ అభిమానులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా భారత క్రికెటర్లను తక్కువ చేస్తూ మాట్లాడాడు. దీంతో భారత అభిమానులు అతనిపై మండిపడుతున్నారు. అసలు రషీద్ చేసిన కామెంట్స్ ఏమిటంటే కొన్ని రోజుల తర్వాత టీమిండియాలో పాకిస్థాన్ ఆటగాళ్లైనా మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ వంటి ఆటగాళ్లు లేరని భారత అభిమానులు బాధపడుతారని చెప్పుకొచ్చాడు. ఓ టీవీ చానల్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. నిజానికి గతంలో పాకిస్థాన్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ వంటి ఆటగాళ్లు లేరని బాధపడేవారని, కానీ కొన్ని రోజుల తర్వాత అచ్చం ఇలాగే భారత అభిమానులు కూడా బాధపడతారని లతీఫ్ వ్యాఖ్యానించాడు. అయితే లతీఫ్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు.
ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ మంచి ప్రదర్శన ఇచ్చారు. ఇద్దరు మంచి ఫామ్‌తో భారీగా పరుగులు చేసి పాకిస్థాన్‌ను అనేక మ్యాచ్‌ల్లో గెలిపించారు. ఈ క్రమంలో వారు టీమిండియాకు చెందిన రోహిత్‌శర్మ, లోకేష్ రాహుల్ రికార్డును అధిగమించారు. ఇప్పటివరకు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ టీ20 ఫార్మాట్‌లో 6 సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేయగా, మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ 7 సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసి.. రోహిత్, రాహుల్‌ను అధిగమించారు. అంతేకాకుండా పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఈ ఏడాది టీ20లో 2 వేల పరుగులు పూర్తిచేశాడు. తద్వారా టీ20 ఫార్మాట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అందులో అంతర్జాతీయ క్రికెట్‌లోనే వెయ్యికి పైగా పరుగులు ఉండడం విశేషం. ఆ తర్వాతి స్థానంలో కూడా మరో పాకిస్థాన్ ఓపెనర్ అయినా ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ ఉండడం గమనార్హం. అలాగే ఈ ఓపెనింగ్ జోడి ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్ విసిరిన 152 పరుగుల లక్ష్యాన్ని ఈ జంట ఒక వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది.
కాగా పాకిస్థాన్‌లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆ దేశంలో క్రికెట్ ఆడడానికి వచ్చిన వెస్టిండీస్ జట్టులోని 9 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇరు జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయింది. అయితే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌ను అతిథ్య పాకిస్థాన్ 3-0తో గెలుచుంది.