
లండన్: ఈ హెడ్డింగ్ చదివి.. అచ్చు తప్పులొచ్చాయని అనుకుంటే పొరపడ్డట్టే. అచ్చంగా పాకిస్తాన్ చేసిన స్కోరే అది. అనుమానాలు ఉంటే- స్కోరు బోర్డును కూడా రెఫర్ చేసుకోవచ్చు. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్ చేరడానికి పాకిస్తాన్ చేసిన పరుగులు అవి. పాకిస్తాన్ బ్యాటింగ్ సెన్సేషనల్ బాబర్ ఆజమ్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. 310 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ ఇమాముల్ హక్ డబుల్ సెంచరీ చేసి, నాటౌట్‌గా నిలవగా.. మరో ఓపెనర్ ఫకర్ జమాన్ 113 రన్స్ చేసి, తమ జట్టును సెమీఫైనల్‌కు చేర్చారు.
భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్.. 105 పరుగులకే చాప చుట్టేసింది. పాకిస్తాన్ బౌలర్ అమీర్ ఏడు వికెట్లు తీసుకుని పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశాడు. ఆశ చావని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు సృష్టించిన స్కోర్ బోర్డు అది. పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరాలంటే 312 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించాల్సి ఉంటుంది. ఇంత భారీ స్కోరును సాధించడం కల్లో మాట. అందుకే- పాకిస్తాన్ వీరాభిమానులు అసలు స్కోర్‌బోర్డును మార్ఫింగ్ చేశారు. ఇలా తమకు తోచిన అంకెలను ఆ స్కోర్‌బోర్డుపై వేసుకుని ముచ్చట తీర్చుకున్నారు.
ఈ మార్ఫింగ్ పిక్ కాస్తా వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హల్‌చల్ చేస్తోంది. దీన్ని ఆధారంగా చేసుకుని టీమిండియా అభిమానులు మరింత చెలరేగిపోతున్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని తమ టాలెంట్ మొత్తాన్నీ వాడేస్తున్నారు. సెటైర్లతో సర్ఫరాజ్ అహ్మద్ అండ్ టీమ్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. అంతకుముందు- బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తాము 500 పరుగులు చేయడానికి ప్రయత్నిస్తామని అంటూ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన స్టేట్‌మెంట్‌ను కూడా దీనికి జోడించి, ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు.