టీ20 వరల్డ్ కప్ బెర్తులన్నీ కూడా ఫుల్ అయ్యాయి.. ఒక్కటి మినహా. భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, న్యూజిలాండ్, శ్రీలంక సూపర్ 8లో అడుగు పెట్టాయి. ఇంకొక్క స్లాట్ మాత్రమే మిగిలివుంది. దీనికోసం పాకిస్తాన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. నేడు నమీబియాతో మ్యాచ్ ఆడబోతోంది. ఈ రెండింటికీ ఇదే చివరి గ్రూప్ మ్యాచ్. ఈ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమౌతుంది. కొలంబో దీనికి వేదిక.
మూడు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లు సాధించిన పాకిస్థాన్‌కు ఇది అత్యంత కీలకం. ఇది గెలిస్తే సూపర్ 8లో ఎంట్రీ ఇస్తుంది. లేదంటే ఆస్ట్రేలియా తరహాలోనేే ఇంటిదారి పడుతుంది. వాన పడి మ్యాచ్ రద్దు కావడం వల్ల ఆస్ట్రేలియా కంటే ఒక పాయింట్ ను అదనంగా సాధించిన జింబాబ్వే సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే వర్షం ఇప్పుడు కూడా పడిందంటే పాకిస్తాన్ కు ఢోకా లేదు గానీ నెట్ రన్ రేట్ వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు.

అక్యువెదర్ అంచనాల ప్రకారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఆకాశం మేఘావృతం కావడానికి 99 శాతం అవకాశం ఉంది. అలాగే- వర్షపాతం పడటానికి 65 శాతం అవకాశం ఉంది. ఉరుములు- మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడే వీలుంది. కొలంబోలో వర్షం పడటానికి 40 శాతం వరకు అవకాశం ఉన్నట్లు అటు శ్రీలంక మెటెరియోలాజికల్ డిపార్ట్ మెంట్ కూడా అంచనా వేసింది. ప్రస్తుతం అక్కడ వాతావరణం మేఘావృతమై ఉంది.
మధ్యాహ్నానికి ఉష్ణోగ్రత 24 నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావొచ్చు. గాలిలో తేమ 80 శాతంగా రికార్డయింది. గంటకు 10-15 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తోన్నాయి. సరిగ్గా ఇటువంటి వాతావరణమే పల్లెకెలెలో ఆస్ట్రేలియా కొంపముంచింది. నమీబియాపై గెలిస్తే నేరుగా సూపర్ 8కు అర్హత సాధిస్తుంది పాకిస్తాన్. ఓడితే మాత్రం నెట్ రన్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది.
భారత్-నెదర్లాండ్స్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. నెదర్లాండ్స్ నాలుగు పాయింట్లకు చేరాలంటే భారత్‌ను భారీ తేడాతో ఓడించాలి. ఆ జట్టు నెట్ రన్ రేట్ ప్రస్తుతం -1.352. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయి, అంపైర్లు ఆటను నిలిపివేస్తే, రెండు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. దీనితో పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో అమెరికాను అధిగమించి రెండో స్థానానికి చేరుకుంటుంది. సూపర్ 8కు అర్హత సాధిస్తుంది.