
లండన్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ప్రస్థానం ముగిసిపోయింది. భారత క్రికెట్ జట్టుపై ఇవాన్ మోర్గాన్ సేన ఘన విజయం సాధించడంతోనే పాకిస్తాన్ ఆశలు అడుగంటిపోయాయి. ఇక ఏ దశలోనూ పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు లేవు. టీమిండియా, న్యూజిలాండ్‌పై బ్యాక్ అండ్ బ్యాక్ విజయాలను నమోదు చేసుకున్న ఇంగ్లీష్ టీమ్.. సెమీ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం పాలైనప్పటికీ..పాకిస్తాన్ కంటే కూడా ఎన్నో రెట్లు మెరుగైన రన్‌రేట్ ఉన్నందున న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కు చేరుకోవడం కేవలం లాంఛనప్రాయమే.
ఈ నేపథ్యంలో- సెమీస్ చేరాలన్న పాకిస్తాన్ ఆశలపై నెటిజన్లు సెటైర్లు సంధిస్తున్నారు. ఒక్కో సెటైర్ ఒక్కో బాంబులా పేలిపోతున్నాయి. కడుపుబ్బా నవ్విస్తున్నాయి. చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ దుర్హం స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించడంతో పాకిస్తాన్ పని ఖతమైపోయింది. ఇక నామమాత్రమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ బంగ్లాదేశ్‌ను ఢీ కొట్టబోతోంది. శుక్రవారం ఈ మ్యాచ్ లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం కాబోతోంది. సెమీస్ చేరాలంటే పాకిస్తాన్ ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 312 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యం.