మరో రెండు రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న వేళ పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టీ20ల సిరీస్‌ను విజయం లేకుండా పేలవంగా ముగించింది. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో ఏడు వికెట్ల తేడాతో పాక్ చిత్తుగా ఓడింది. ఈ సిరీస్‌లో పాకిస్థాన్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. వర్షం కారణంగా తొలి, మూడు టీ20 రద్దవ్వగా, మిగిలిన రెండింట్లో పాకిస్థాన్ ఆలౌటైంది.
ఒక్క పాకిస్థాన్ బ్యాటర్ కూడా 50 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయాడు. జూన్ 2 నుంచి మెగా సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పాక్ బ్యాటర్లు ఫామ్ కోల్పోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. ఆఖరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు కుప్పకూలింది. ఉస్మాన్ ఖాన్ (38; 21 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ అజామ్ (36; 22 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్లు.

అయితే పాక్‌కు శుభారంభం లభించింది. పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయింది. పాకిస్థాన్ బ్యాటర్లలో నలుగురు పరుగుల ఖాతా తెరవలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్, అదిల్ రషీద్, మార్క్ వుడ్ తలో రెండు వికెట్లు తీశారు. ఆర్చర్, జోర్డాన్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ 15.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హారిష్ రవూఫ్ మూడు వికెట్లు తీశాడు.
ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (45; 24 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ దూకుడుగా ఆడాడు.సాల్ట్‌తో పాటు కెప్టెన్ బట్లర్ (39; 21 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) కూడా సత్తాచాటడంతో ఇంగ్లండ్ పవర్‌ప్లేలో 78 పరుగులు సాధించింది. ఓపెనర్లద్దిరూ ఔటైనప్పటికీ బెయిర్ స్టో (28*; 16 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (17; 14 బంతుల్లో) కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు.