టీ20 వరల్డ్ కప్-2024లో పాకిస్థాన్ కథ లీగ్ స్టేజ్‌లోనే ముగిసింది. ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచి, అంతేగాక అదృష్టంతో సూపర్-8కు చేరాలనుకున్న పాకిస్థాన్ ఆశలు ఆవిరయ్యాయి. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్ స్టేడియంలో శుక్రవారం జరగాల్సిన అమెరికా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో తొలి రౌండ్‌లోనే పాక్ ఇంటిముఖం పట్టింది. మరోవైపు గ్రూప్-ఏ నుంచి భారత్‌తో పాటు అమెరికా తదుపరి దశకు అర్హత సాధించింది.
ఫ్లోరిడాలో గత కొన్ని రోజులుగానే ప్రతికూల వాతావరణం నెలకొంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడ జరగాల్సిన మ్యాచ్‌లపై నిర్వహణపై సందేహాలు పెరిగాయి. అయితే వరుణుడు కరుణిస్తాడనుకున్న పాకిస్థాన్‌కు చుక్కెదురైంది. వర్షం కారణంగా అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ కనీసం టాస్ పడకుండానే రద్దు అయ్యింది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సిన ఉండగా తొలుత టాస్ ఆలస్యం అయ్యింది.

ఆ తర్వాత వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ నిర్వహణకు మైదాన సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. కానీ మరోసారి వరుణుడు రీఎంట్రీ ఇస్తూ మ్యాచ్‌ను జరగనివ్వలేదు. ఇక పరిస్థితి మెరుగవ్వదని నిర్ణయించిన అంపైర్లు రాత్రి 11 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా, ఐర్లాండ్‌కు చెరో పాయింట్ ఇచ్చారు. దీంతో యూఎస్‌ఏ ఖాతాలో అయిదు పాయింట్లు చేరాయి. గ్రూప్-ఏలో భారత్ (6 పాయింట్లు) తర్వాత ఆతిథ్య జట్టు రెండో స్థానంలో నిలిచింది.
మరోవైపు పాకిస్థాన్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయమే సాధించిన విషయం తెలిసిందే. అమెరికా చేతిలో సూపర్ ఓవర్‌లో కంగుతిన్న పాకిస్థాన్‌ను భారత్ చిత్తుగా ఓడించింది. దీంతో రెండు పాయింట్లు, +0.191 నెట్‌రన్‌రేటుతో టేబుల్‌లో మూడు స్థానంలో ఉంది. కానీ అదృష్టంతో సూపర్-8కు చేరాలని నిన్నటి వరకు కలలు కనింది. అమెరికాపై ఐర్లాండ్ గెలిచి, ఆ తర్వాత ఐర్లాండ్‌ను ఆదివారం ఓడించి తదుపరి దశకు చేరుకోవాలనుకుంది. కానీ పాకిస్థాన్ ఆశలపై వరుణుడు నీళ్లు చెల్లాడు.

యునైటెడ్ స్టేట్స్ లీగ్ దశను అయిదు పాయింట్లతో ముగించింది. తమ ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై ఆదివారం నెగ్గినా పాకిస్థాన్ గరిష్టంగా నాలుగు పాయింట్లతోనే నిలుస్తుంది. దీంతో అమెరికాను పాయింట్ల పరంగా పాక్ దాటే అవకాశం లేకపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.