న్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ మధ్య క్రికెట్ అంటేనే ఆసక్తికరంగా ఉంటుంది. పురుషుల జట్టు మ్యాచ్ అయినా, మహిళల జట్టు మ్యాచ్ అయినా ఉత్కంఠగా ఉంటుంది. పురుషుల జట్టు మ్యాచ్ అంటే ఒకింత ఉత్కంఠ, ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచ వరల్డ్ ట్వంటీ 20 కప్ మ్యాచులు జరుగుతున్న విషయం తెలిసిందే. పురుషులతో పాటు మహిళా జట్ల మధ్య కూడా మ్యాచ్‌లు సాగుతున్నాయి. మహిళా జట్టు మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో శనివారం జరిగిన భారత్ - పాక్ మహిళల ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా పాకిస్తానీ క్రికెట్ జట్టుకు చెందిన ఆనం ఆమిన్.. భారత బ్యాట్స్ ఉమెన్ ఉమర్ హర్ ప్రీత్ కౌర్ షూ లేసుకును కట్టడం అందర్నీ ఆకట్టుకుంది.
ఆ మ్యాచ్‌లో భారత జట్టు పైన పాకిస్తాన్ గెలిచింది. అయితే, భారత్ క్రికెటర్‌కు పాక్ క్రికెటర్ షూ లేస్ కట్టిన అంశం మాత్రం అందరి హృదయాలను గెలుచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. ఇరు దేశాల్లో అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.