Imad Wasim: పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తన భార్య సానియా అష్ఫాక్ ను మోసం చేస్తున్నాడని ఆరోపణలు కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. పాకిస్థానీ మీడియా నివేదికల ప్రకారం.. ఇటీవల తండ్రి అయిన ఈ మాజీ క్రికెటర్‌పై వివాహేతర సంబంధం ఆరోపణలు రావడంతో ఇమాద్ వసీమ్ తన భార్యతో విడిపోయినట్లు సమాచారం. నిజానికి ఇమాద్ వసీమ్ భార్య చేసిన ఒక కొత్త సోషల్ మీడియా పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. పాకిస్థాన్ మీడియా ప్రకారం.. సానియా ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో ఇలా రాసి ఉంది. "నేను నిన్ను 9 నెలల పాటు ఒంటరిగానే నా కడుపులో మోశాను. ముందున్న ప్రయాణానికి అల్లా నాకు మరింత శక్తిని ప్రసాదించుగాక, జైన్." అని సానియా అష్పాక్ రాసుకొచ్చారు.
నివేదిక ప్రకారం.. సానియా తన ఇన్‌స్టాగ్రామ్ బయోను "వైఫ్ టు ఇమాద్ వసీమ్" నుంచి "మామ్ టు ఇనాయా ఇమాద్ మరియు ర్యాన్ ఇమాద్"గా మార్చినట్లు తెలిసింది. మరోవైపు సోషల్ మీడియా యూజర్లు మాజీ క్రికెటర్ ఇమాద్ వసీమ్‌కు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, లాయర్ నైలా రజాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అయితే, ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రజా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ పుకార్లపై ఖండించింది. ఈ పుకార్లు సృష్టించేవారిని హెచ్చరించింది.

ఈ పుకార్ల మధ్య ఇమాద్ వసీమ్ ఈ ఆరోపణలను ధ్రువీకరించలేదు లేదా ఖండించలేదు. దీంతో అభిమానులు ఒక అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మీడియా దృష్టి నిరంతరం పెరుగుతోంది. ఇక ఇమాద్ వసీమ్‌పై ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆఫ్ఘనిస్తాన్‌లో జన్మించిన ఒక డచ్ యువతి అతనిపై మోసం ఆరోపణలు చేసింది. 2017లో వీరిద్దరి ప్రైవేట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీకయ్యాయి. ఇమాద్ వసీమ్‌కు చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆ యువతి ఆరోపించింది.