
హైదరాబాద్: మరో పాక్ క్రికెటర్ భారత్‌పై విషం కక్కాడు. ఏకంగా వాఘా బోర్డర్‌లో భారత సైన్యం ముందు హంగామా చేశాడు. రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తూ ఊగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ప్రతి రోజూ వాఘా బోర్డర్‌లో ఇరు దేశాల సైన్యం కవాతు చేస్తుంది. దీన్ని చూసేందుకు ఇరు దేశాల ప్రజలు వస్తుంటారు. అయితే పాక్ క్రికెటర్ హసన్ అలీ కూడా బోర్డర్‌కు వచ్చాడు.
జనాలతో పాటూ గ్యాలరీలో కూర్చొన్నాడు. కొద్దిసేపటికి ఇరు దేశాల సైన్యాలు... అక్కడి గేట్లను తీసి కవాతు చేయడం ప్రారంభించాయి. కవాతు మధ్యలో హసన్ అలీ గేట్లవైపు పరుగు తీశాడు. అక్కడే నిలబడి సైన్యాన్ని, అక్కడే గ్యాలరీలో ఉన్న భారతీయుల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు. తన చేష్టలతో పిచ్చి, పిచ్చి వేషాలు వేస్తూ రెచ్చిపోయాడు. ఇంత జరుగుతున్నా ఎవరూ కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ వ్యవహరాన్ని భారత సైన్యం సీరియస్‌గా తీసుకుంది.
కవాతు జరిగే సమయంలో ఇలా ప్రవర్తించడ ఏంటంటూ మండిపింది. హసన్‌తో క్షమాపణలు చెప్పించి... ఘటనపై విచారణ జరిపించి, వివరణ ఇవ్వాలని పాక్ సైన్యానికి లేఖ రాయాలని కూడా సైన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంత జరిగినా పాక్ ఆర్మీ మాత్రం స్పందించలేదు. అంతేకాక హసన్ ఏదో గొప్ప పని చేసినట్లు... ఓ పత్రిక అతడ్ని పొగడ్తలతో ముంచెత్తుతూ కథనాన్ని రాసింది.
ఘటనపై డీఐజీ ఆర్ ఎస్ కటారియా స్పందించారు. 'ఆ సమయంలో నేను సెలవులో ఉన్నాను. ఇరు దేశాల మధ్య కవాతు జరుగుతున్న సమయంలో పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు ఆటగాడు లేచి విన్యాసాలు చేస్తోంటే, పాకిస్థాన్ ఆర్మీ అతన్ని వారించి కూర్చోబెట్టింది. ఇరు దేశాల ఆర్మీ చేస్తున్న కవాతు మధ్యలో ఇలాంటివి చేయకూడదని' తెలిపినట్లుగా పేర్కొన్నారు.