న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచకప్ జట్లలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోసం సెర్చింజన్ 'గూగుల్'లో ఎక్కువ మంది వెతుకుతున్నారట. ఈ విషయం తాజా స్టడీలో తెలిసిందని గ్లోబల్ ఆన్ లైన్ జెయింట్ గూగుల్ తెలిపింది. ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఆకట్టుకునేలా ఏమాత్రం ఆడటం లేదు. రెండు మ్యాచులు ఓడిన పాక్.. ఆదివారం నాడు జింబాబ్వేతో కష్టంగా గెలిచింది.
అయితే, మ్యాచులలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ ఈ జట్టు కోసం ఎక్కువ మంది సెర్చింజన్ గూగుల్‌లో వెతుకుతున్నారు. భారత జట్టు, వెస్టిండీస్ పైన రెండుసార్లు ఘోరంగా ఓడినప్పటికీ పాకిస్తాన్ జట్టు కోసం ఆన్ లైన్లో వెతుకుతున్నారని తెలిపింది.
పాకిస్తాన్ తర్వాత భారత్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పసికూనలుగా చెప్పుకుంటున్న బంగ్లాదేశ్, ఐర్లాండ్, యూఏఈ, ఆప్ఘనిస్తాన్‌ల కోసం కూడా చాలామంది వెతికారు.

పాక్ పేసర్ మొహమ్మద్ ఇర్ఫాన్ కచ్చితమైన ఎత్తు గురించి భారత అభిమానులు వెతికితే, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు.. జేమ్స్ టేలర్ హైట్ గురించి వెతికారు. ఇక, జయవర్ధనే బ్యాట్ రెండు ముక్కలు కావడం గురించి, క్రిస్ గేల్ డ్యాన్స్ గురించి కూడా చాలామంది వెతికారు. వెస్టిండీస్ ఆటగాళ్లలో ఎక్కువగా గేల్ కోసమే వెతికారు. ఆయన డబుల్ సెంచరీ చేసిన సమయంలో అది మరింత ఎక్కువగా ఉంది.
మన ఆటగాళ్ల విషయానికి వస్తే...
విరాట్ కోహ్లీ కొత్త హెయిర్ స్టయిల్ గురించి నెటిజన్లు గూగుల్‌లో బాగానే వెతికారు. దక్షిణాఫ్రికా - భారత్ మ్యాచ్ సమయంలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీల బ్యాటింగ్ కన్నా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సెల్ఫీ కోసమే ఎక్కువ వెతికారు.