
హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో భారత యువ జట్టు ఫైనల్‌కు చేరడంతో ఆ జట్టు కోచ్‌గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 203 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది.
ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ లాంటి లెజెండరీ బ్యాట్స్‌మన్ పాకిస్థాన్‌కు కూడా కావాలని ఆ జట్టు మాజీ ఆటగాడు రమీజ్ రాజా అన్నాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లను రాహుల్ ద్రవిడ్ సానబట్టే విధానం అటు మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులకు ఎంతగానో నచ్చుతోంది.
సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడం తనకు ఏమంత ఆశ్చర్యాన్ని కలిగించలేదని రమీజ్ రాజా పేర్కొన్నాడు. కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎలా అధిగమించాలో యువ ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నారని తెలిపాడు.
'భారత ఆటగాళ్లు చూపించిన తెగువ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. శుభమాన్ గిల్ అద్భుత ప్రదర్శనతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా. యువ ఆటగాళ్లను ఆ విధంగా తీర్చిదిద్దిన రాహుల్ ద్రవిడ్‌కే ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది' అని రమీజ్ రాజా వెల్లడించాడు.
భారత యువ క్రికెటర్లకు రాహుల్ ద్రవిడ్ లాంటి లెజెండరీ బ్యాట్స్‌మన్ దొరకడం నిజంగా అదృష్టమని చెప్పాడు. 'ద్రవిడ్ నుంచి కేవలం క్రికెట్ మాత్రమే కాదు, ఇతర విషయాలను కూడా వారు తెలుసుకుంటున్నారు. అందులో ముఖ్యమైనది నడవడిక, పరిస్థితులను బట్టి గేమ్‌ను ఎలా అర్ధం చేసుకోవాలో లాంటివి' అని అన్నాడు.
అలాగే పాకిస్థాన్ అండర్-19 జట్టులో బ్యాటింగ్ టాలెంట్ లేకపోవడంపై రమీజ్ రాజా అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ పూర్తిగా యూత్ క్రికెట్ సిస్టమ్‌నే ప్రక్షాళన చేయాలని ఈ సందర్భంగా రమీజ్ రాజా సూచించాడు. యూత్ క్రికెట్‌పై బోర్డు కూడా దృష్టిసారించాలని సూచించాడు.
కాగా, అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్థాన్‌కు ఇదే అతిపెద్ద ఓటమి. పాక్ ఓటమితో అక్కడి అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన నెటిజన్లు భారత్ జట్టుకు ద్రవిడ్‌లాంటి లెజెండ్ కోచ్‌గా ఉన్నాడని, పాక్‌కు మాత్రం అలాంటి వ్యక్తి లేకపోవడం వల్లే ఓటమిపాలైందని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
భారత క్రికెట్ భవిష్యత్తు అసలు సిసలైన వ్యక్తి చేతుల్లోనే ఉందని క్రికెట్ అభిమానులు సైతం రాహుల్ ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.