హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న పాక్‌పై పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
అయితే భారత్‌పై ఘన విజయం సాధించిన సందర్భంగా ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అప్రిది హర్షం వ్యక్తం చేశాడు. పనిలో పనిగా ఐసీసీకి ఓ మెసేజ్ కూడా ఇచ్చాడు. భారత్, పాక్ మధ్య మరిన్ని మ్యాచ్‌లు జరిగేలా దృష్టి సారించాలని సూచించాడు. ఇందుకు భారత ప్రభుత్వం సహకరించాలని చెప్పాడు.

2011లో మొహాలీలో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు తాను కెప్టెన్‌గా వ్యవహరించానని, తనకు ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్ ప్రాముఖ్యత ఏంటో తెలుసని అన్నాడు. ఇరు దేశాల మధ్య శాంతిని పెంపొందించడంలో క్రికెట్ కీలక పాత్ర పోషిస్తుందని అప్రిది అన్నాడు.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను కూడా కొంత వరకూ తగ్గు ముఖం పట్టాలని, శాంతి భావంతో మెలగాలని కోరుకుంటున్నట్లు అఫ్రిది ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.