
శ్రీలంకతో జరిగిన ఫైనల్లో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ స్లో ఇన్నింగ్స్ పట్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. చాలా మంది రిజ్వాన్ ఆడాల్సిన విధానం అది కాదంటూ పేర్కొంటున్నారు. ఇకపోతే పాకిస్థాన్ కోచ్ సక్లైన్ ముస్తాక్ మాత్రం రిజ్వాన్‌ను సమర్థించేలా మాట్లాడాడు. శ్రీలంక తొలుత 170పరుగులు నమోదు చేసి 171పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక బౌలర్ల ఆదిలోనే రెండు వికెట్లు (బాబర్ ఆజామ్, ఫాఖర్ జమాన్) తీసి రిజ్వాన్‌ను ఒత్తిడిలోకి నెట్టేశారు. రిజ్వాన్ 49 బంతుల్లో 55పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అతని స్లో ఇన్నింగ్స్ వల్ల రిక్వయిడ్ రన్ రేట్ పెరుగుతూనే పోయింది. ఫలితంగా తప్పకుండా ప్రతి ఓవర్లో హిట్టింగ్ చేసే పరిస్థితి తలెత్తి పాక్ మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు క్యాచ్ ఔట్ అయి కుప్పకూలారు.
చివరికి పాకిస్తాన్ 147పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక తన ఖాతాలో ఆరో ఆసియా కప్ ట్రోఫీని అందుకుంది. రిజ్వాన్ ఇన్నింగ్స్‌ను చాలా మంది విమర్శకులు ఛీకొట్టారు. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ పేస్ దిగ్గజం షోయాబ్ అక్తర్ కూడా ఏకిపారేశాడు. ట్విట్టర్లో తన అభిప్రాయం ఏంటో చెప్పేశాడు. 'పాకిస్థాన్ టీం కాంబినేషన్ ఏమాత్రం బాలేదు. జట్టులో చాలా విషయాలు పరిశీలించాలి. ఫాఖర్, ఇఫ్తికార్, ఖుష్దిల్ అందరినీ ఒకసారి పరీక్షించాలి. జట్టుకు వాళ్లు సెట్టవుతారో కాదో చూడాలి. రిజ్వాన్ దాదాపు 50బంతుల్లో 50పరుగులు చేశాడు. దాని వల్ల పాకిస్థాన్‌కు నయా పైసా ప్రయోజనం లేదు. హ్యాట్సాఫ్ శ్రీలంక. వాటే టీం' అని అక్తర్ అన్నాడు.
సక్లైన్ ముస్తాక్ మాత్రం రిజ్వాన్‌ను సమర్థించాడు. 'బయటి నుండి వ్యాఖ్యానించడం చాలా సులభం, వారు జట్టులో భాగమైనప్పుడు మాత్రమే అసలేం జరిగిందో తెలుసుకుంటారు. రిజ్వాన్ పొరపాటు ఏం లేదు. బయటివారు రిజల్ట్, స్కోర్‌కార్డ్‌ను చూసి వారు తమ కామెంట్లు చేశఆరు. కానీ వారికి డ్రెస్సింగ్ రూమ్‌లో ఏమి జరుగుతుందో ఏం తెలుసు. ప్లేయర్ల ఆత్మవిశ్వాసం, వారు గాయాల నుంచి కోలుకుని ఆడుతున్న విధానం గురించి ఏమాత్రం పట్టింపు ఉండదు. నేను మూడేళ్లుగా జట్టుతో పాటు ఉంటున్నాను. కాబట్టి ఏం జరుగుతుందనే విషయాలు నాకు తెలుసు. బయట కామెంట్లు చేసే వారు ఒక్కసారి జట్టు లోపలికొచ్చి క్రికెటర్లతో సన్నిహితంగా ఉంటే మాత్రమే తెలుస్తుంది.' అని ముస్తాక్ పరోక్షంగా షోయబ్ అక్తర్‌ను ఉద్దేశించి అన్నాడు.