IND vs PAK: ఆసియా కప్ 2025 ఫైనల్ పోరు చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. దాయాదుల మధ్య పోరు అనగానే క్రికెట్ ప్రేమికుల్లో నూతనోత్సాహం ఉప్పొంగింది. అయితే ఇప్పటికే పాకిస్తాన్ గ్రూప్ దశ, సూపర్-4లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అయితే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ పాక్ విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై ఓ దశలో పాకిస్తాన్ ఓటమి ఖాయమనిపించినా.. చివరికి సల్మాన్ అలీ ఆఘా టీమ్ గెలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ గురించి పాక్ కోచ్ మైక్ హెసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మైక్ హెసన్ ఏం అన్నారంటే?
పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెసన్ తన ఆటగాళ్లు కేవలం క్రికెట్ పైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఇటీవల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ.. ఆటగాళ్లు ఆటపైనే దృష్టి పెట్టాలని ఆయన కోరుకుంటున్నారు. బంగ్లాదేశ్ జట్టుపై గెలిచిన తర్వాత మైక్ హెసన్ మాట్లాడుతూ.. "ఆటగాళ్లకు నా సందేశం ఏంటంటే.. వారు కేవలం క్రికెట్ పైనే దృష్టి పెట్టాలి. మేం అదే చేస్తాం కూడా. హావభావాల విషయానికి వస్తే.. అధిక ఒత్తిడి ఉన్న ఆటల్లో ఎప్పుడూ ఉత్సాహం ఉంటుంది. మేం భారత్ పై ఎక్కువ సేపు ఒత్తిడి కొనసాగించాలి. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్టు వాళ్లది, కాబట్టి అలా చేయడం అవసరం. ఇది మాకు ఒక సవాల్ అవుతుంది" అని ఆయన వెల్లడించారు.

రెండు మ్యాచ్‌ల్లోనూ ఏకపక్షంగా ఓడిపోయిన పాకిస్తాన్
గ్రూప్ దశలో భారత్ చేతిలో పాకిస్తాన్ ఏకపక్షంగా ఓడిపోయింది. సూపర్-4లో మాత్రం పాకిస్తాన్ కాస్త పోటీ ఇచ్చింది. మైక్ హెసన్ ఇంకా మాట్లాడుతూ.. "గత మ్యాచ్‌లో మేం భారత్‌పై మెరుగ్గా ఆడాం. మొదటి మ్యాచ్‌లో మేం కొంచెం బలహీనంగా ఉన్నాం, భారత్‌ను ఆటపై నియంత్రణ సాధించనిచ్చాం. గత మ్యాచ్‌లో మేం ఎక్కువసేపు ఆటను మా నియంత్రణలో ఉంచుకున్నాం. కానీ అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు." అని వ్యాఖ్యానించారు. "మాకు ఈ అవకాశం లభించింది, ఇప్పుడు మేం దానిని సద్వినియోగం చేసుకోవాలి. మేం ట్రోఫీ గెలవడానికి ప్రయత్నిస్తున్నాం. మేం భారత్‌పై ఒత్తిడిని కొనసాగించాలి. మేం అలా చేయగలిగితే, గెలిచే అవకాశం మాకు ఉంటుంది" అని మైక్ హెసన్ పేర్కొన్నారు.భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 28న ఆసియా కప్ టైటిల్ పోరు జరగనుంది.