ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమిని అందుకోవడంతో పాకిస్థాన్ జట్టు తీవ్ర విమర్శలను అందుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు కోచ్ కు గట్టి షాక్ తగలనుంది. తాత్కాలిక కోచ్ అకిబ్ జావెద్‌తో పాటు సహాయక సిబ్బందిపై వేటు వేయనున్నారట. ఆ దిశగా పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సిద్ధమవుతున్నట్లు సమాచారం అందింది.
గత ఏడాది గ్యారీ కిర్‌స్టెన్ రాజీనామా చేయడం వల్ల అకిబ్‌ను.. పాక్ పరిమిత ఓవర్ల జట్టుకు తాత్కాలిక కోచ్ గా నియమించారు. జాసన్ గిల్లెస్పీ కూడా రిజైన్ చేయడం వల్ల టెస్టు జట్టుకూ అకిబ్‌నే కోచ్‌గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ విఫలమైన నేపథ్యంలో అకీబ్ ను తొలిగించేందుకు సిద్ధమయ్యారట. అతడిని కోచ్ పదవిలో కొనసాగించడం కష్టమేనని పాక్ క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అతడితో పాటు సపోర్టింగ్ స్టాఫ్ ను తొలిగిస్తారని చెబుతున్నాయి.

స్పాన్సర్లు వస్తారో లేదు..
ఛాంపియన్స్ ట్రోఫీలో చెత్త ప్రదర్శన చేసి పాకిస్థాన్ ముందుగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో ఇప్పుడు ఆ జట్టుకు స్పాన్సర్లు రావడం అనుమానంగా మారింది. అలానే టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌లకు కూడా అభిమానులు స్టేడియానికి వస్తారో రారో అని పీసీబీ టెన్షన్ పడుతోంది. ఒకవేళ ప్రేక్షకులు స్టేడియానికి రాకపోతే ప్రసారదారుకు ఇబ్బందులు ఎదురౌతాయి. ఈ పరిణామం భవిష్యత్ లో పాక్ క్రికెట్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు పీసీబీలో ఆందోళన మొదలైంది.