పాక్ క్రికెట్లో ఎప్పుడూ ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంటుంది. తాజాగా టీ20 ప్రపంచ కప్‌లో నమీబియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాక్ జట్టులో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, హెడ్ కోచ్ మైక్ హెస్సన్ మధ్య డగౌట్లో జరిగిన తీవ్ర వాగ్వాదం ఇప్పుడు క్రీడాలోకంలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా 23 బంతుల్లో 38 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతను అవుట్ అయి డగౌట్‌కు చేరుకున్న తర్వాత అసలు డ్రామా మొదలైంది. కెప్టెన్ సల్మాన్, జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సన్ మధ్య ఏదో విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. మైదానంలోని కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ప్రకారం.. మైక్ హెస్సన్ కెప్టెన్ సల్మాన్‌కు ఏదో సీరియస్‌గా వివరించడానికి ప్రయత్నించారు. బహుశా సల్మాన్ ఆడిన షాట్ సెలెక్షన్ లేదా మ్యాచ్ పరిస్థితిపై కోచ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కోచ్ మాటలకు సల్మాన్ ఆగా ఏమాత్రం తగ్గకుండా ఆవేశంగా స్పందించడంతో డగౌట్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. వీరిద్దరి గొడవ చూసి తోటి ఆటగాళ్లు కూడా బిత్తరపోయారు.

ఆగ్రహంతో బాటిల్ విసిరికొట్టిన పాక్ కెప్టెన్
కోచ్‌తో వాగ్వాదం జరుగుతున్న సమయంలో సల్మాన్ అలీ ఆఘా తన సహనాన్ని కోల్పోయాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన అతను చేతిలో ఉన్న నీళ్ల బాటిల్‌ను నేలకేసి బలంగా విసిరికొట్టాడు. కెప్టెన్ చేసిన ఈ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ ప్రవర్తన క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుందని కొందరు విమర్శిస్తుంటే.. పాక్ జట్టులో ముఠా తగాదాలు మొదలయ్యాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
భారత్ చేతిలో ఓటమి తర్వాత పెరిగిన ఒత్తిడి
ఈ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు పరిస్థితి ఏమంత బాగోలేదు. ఇటీవలే భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చిరకాల ప్రత్యర్థి చేతిలో ఓడిపోవడంతో జట్టుపై, కెప్టెన్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలోనే నమీబియా వంటి చిన్న జట్టుతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా డగౌట్‌లో ఇటువంటి గొడవలు జరగడం పాక్ క్రికెట్ బోర్డు (PCB) లో ఉన్న అస్తవ్యస్త పరిస్థితులకు అద్దం పడుతోంది.
పాక్ కెప్టెన్, కోచ్ మధ్య జరిగిన ఈ వివాదం కేవలం ఆ మ్యాచ్ వేడిలో జరిగినదా లేక జట్టులో ఏవైనా పెద్ద విభేదాలు ఉన్నాయా అనేది వేచి చూడాలి. టీ20 వరల్డ్ కప్ వంటి పెద్ద టోర్నీలో కెప్టెన్ ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం పాక్ జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.